Divitimedia
Bhadradri KothagudemHealthLife StyleSpot NewsTelanganaWELFAREWomen

ఘోరంగా వైద్య,ఆరోగ్య సిబ్బంది పనితీరు…

ఘోరంగా వైద్య,ఆరోగ్య సిబ్బంది పనితీరు…

అధికారుల తనిఖీలలో వెలుగులోకి వాస్తవాలు

✍️ దివిటీ మీడియా

వైద్య ఆరోగ్య శాఖలో సిబ్బంది పనితీరు ఘోరంగా మారుతోంది… పేద ప్రజలకు శారీరక, ఆర్థిక స్థితిగతులపై కీలకమైన ప్రభావం చూపే వైద్యసేవల విషయంలో క్షేత్రస్థాయి సిబ్బంది బాధ్యతారాహిత్యం ఇబ్బందికరంగా మారింది. ఈ కారణంగా గ్రామీణ పేదలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులేర్రడ్డాయి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు జరిపిన పరిశీలనలో క్షేత్రస్థాయిలో ఆందోళనకర పరిస్థితులు, సిబ్బంది పనితీరులో లోపాలు వెలుగు చూశాయి. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డా.తుకారాం రాథోడ్ ఆదేశాల మేరకు శనివారం చేసిన పరిశీలన, తనిఖీల్లో గుర్తించిన లోపాలు క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరుకు అద్దం పడుతున్నాయి. జిల్లాలో సాధారణ టీకా కార్యక్రమాల అమల్లో నాణ్యత, సేవల అందుబాటు, వ్యాక్సిన్ నిర్వహణతీరు పర్యవేక్షించేందుకు జిల్లా శిశు ఆరోగ్య, రోగనిరోధక టీకాల అధికారి (DCH&IO) డాక్టర్.ప్రతాప్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌ జి.నాగభూషణం పరిశీలన చేశారు. ఈ పరిశీలనలో భాగంగా కొత్తగూడెంలోని అర్బన్ ఫ్యామిలీ వెల్ నెస్ సెంటర్ (UFWC), రామవరంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) పరిధిలో 14వ వార్డు, పంజాబ్ గడ్డ అంగన్‌వాడీ కేంద్రం, పెనగడప పి.హెచ్.సి పరిధిలోని బేరియంతండా టీకాకేంద్రాలను తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా కొత్తగూడెం అర్బన్ ఫ్యామిలీ వెల్ నెస్ సెంటర్ (UFWC)లో ముగ్గురు ఏఎన్ఎంలు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. దీనివల్ల సాధారణ టీకా కార్యక్రమాల నిర్వహణ తీరుపై ప్రతికూల ప్రభావం పడినట్లు గమనించారు. హెచ్.పి.వి (HPV) టీకా కార్యక్రమాలు నిర్వహించడం లేదని గుర్తించారు. రామవరం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC)లో హెచ్.పి.వి (HPV) టీకా కార్యక్రమాలు నిర్వహించక పోవడం, ఏఎన్ఎంలు సరైన డ్యూ లిస్టులు నిర్వహించకపోవడం వల్ల సున్నా నమోదు సెషన్లు అవుతున్నట్లు గుర్తించారు. అవసరానికి మించిన వ్యాక్సిన్లు సెషన్ ప్రాంతాలకు తీసుకెళ్లడం వల్ల వ్యాక్సిన్ నాణ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని సూచించారు. ఒక్క లబ్ధిదారుని కోసం కూడా కొత్త వ్యాక్సిన్ వైల్స్ తెరవడం, సబ్‌సెంటర్ల మధ్య సమన్వయం లేక పోవడం వల్ల వ్యాక్సిన్ వృథా అవుతున్న విషయాన్ని గుర్తించారు. పెనగడప పి.హెచ్.సి పరిధిలోని బేరియంతండా టీకా కేంద్రంలో మొదటి ఏఎన్ఎం తన వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉన్నట్లు గుర్తించారు. డ్యూ లిస్టులను నిర్దేశిత రిజిస్టర్లలో కాకుండా వేరే నోట్‌బుక్స్‌లో నిర్వహిస్తున్నట్లు గమనించారు. వైద్య, ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం నిర్దేశిత రికార్డులు, రిజిస్టర్లలోనే నమోదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, టీకా కార్యక్రమాలు, హెచ్.పి.వి వ్యాక్సినేషన్, వ్యాక్సిన్ నిల్వ, నిర్వహణ ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని ఆరోగ్యసంస్థలు టీకా కార్యక్రమాల నాణ్యతను మెరుగుపరచడంతో పాటు వ్యాక్సిన్ వృథాను నివారించి, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సేవలందేలా చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. ఈ దిద్దుబాటు చర్యలు, సూచనలు ఎంత మేరకు అమలవుతాయనేది వేచి చూడాల్సిందే…

Related posts

తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ 

Divitimedia

నవంబరు 10న ఉమ్మడి జిల్లా పాఠశాలల బాక్సింగ్, సాఫ్ట్ బాల్ ఎంపికలు

Divitimedia

సర్వే వివరాలు పకడ్బందీగా ఆన్లైన్ చేయాలి

Divitimedia

Leave a Comment