Divitimedia
Bhadradri KothagudemHyderabadLife StylePoliticsSpot NewsTelanganaWELFARE

సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి పొంగులేటి

సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి పొంగులేటి

దమ్మపేట–పాల్వంచ నాలుగు లేన్ల రోడ్డు పనులకు శంకుస్థాపన

✍️ దివిటీ మీడియా (కొత్తగూడెం)

రాష్ట్రంలో అవసరమైన ప్రతిచోట మౌలిక సదుపాయాల కల్పనకు, అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాలశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని దమ్మపేట–పాల్వంచ ప్రధానరహదారిలో రెండున్నర కిలోమీటర్లమేర నాలుగు లేన్ల రహదారి విస్తరణ పనులకు పొంగులేటి శంకుస్థాపన చేశారు. మంత్రి పొంగులేటి తోపాటు స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లాకలెక్టర్ అంకిత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా ఖనిజ ఫౌండేషన్ ట్రస్ట్ (డీఎంఎఫ్‌టీ) నిధులతో రూ.14కోట్ల వ్యయంతో ఈ రహదారి విస్తరణ పనులు చేపట్టారు. మంచికంటి నగర్ హర్ష టౌన్‌షిప్‌లో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీరోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం నుంచి గోధుమవాగు బ్రిడ్జి వరకు రూ.50లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సెంట్రల్ లైటింగ్, డివైడర్ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. దమ్మపేట–పాల్వంచ రహదారి అనేక సంవత్సరాలుగా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని, పాల్వంచ, అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల ప్రజలు ఈ రహదారిపై ఆధారపడుతున్నందున అత్యవసరంగా డీఎంఎఫ్‌టీ నిధుల నుంచి రూ.14కోట్లు మంజూరు చేసి నాలుగులేన్ల రహదారిగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. పనులను నాణ్యతతో, గడువులో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పాల్వంచ ప్రాంతంలో పెండింగ్‌ భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. సింగరేణి పరివాహక ప్రాంతాల జీవో–76 అంశంపై కూడా ప్రభుత్వం సానుకూల పరిశీలన చేస్తోందని, త్వరలోనే దీనిపై స్పష్టత ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
జిల్లాలో ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలతో ప్రత్యామ్నాయ పంటలు, మెట్ట పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయడం వల్ల నష్టాలను తగ్గించుకోవచ్చని, దీనిపై రైతులకు గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన పెంచాలని అధికారులను ఆదేశించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, ప్రజలెన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న అభివృద్ధి నేడు వేగంగా జరుగుతోందన్నారు. కొత్తగూడెం –పాల్వంచ బైపాస్ రహదారి నిర్మాణం, యూనివర్సిటీ అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయి స్టేడియం ఏర్పాటు, పాల్వంచలో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం, మెడికల్ కాలేజీ, ఎస్పీ కార్యాలయం వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పేరు “కొత్తగూడెం–పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్”గా మార్చే ప్రతి పాదనపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలితకుమారి, కమిషనర్ సుజాత, జిల్లా అదనపు కలెక్టర్ విద్యాచందన, కొత్తగూడెం ఆర్టీవో మధు, పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పోలీసులకు పట్టుబడిన వాహనాలకు 27న వేలం

Divitimedia

చర్ల పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం

Divitimedia

జిల్లాలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

Divitimedia

Leave a Comment