Divitimedia
Bhadradri KothagudemCrime NewsFarmingHyderabadLife StyleSpot NewsTechnologyTelangana

అటవీ–రెవెన్యూ భూసమస్యల పరిష్కారం వేగవంతం చేయాలి

అటవీ–రెవెన్యూ భూసమస్యల పరిష్కారం వేగవంతం చేయాలి

అధికారులతో సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

✍️ దివిటీ మీడియా (కొత్తగూడెం)

రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రక్రియతో పాటు అటవీ–రెవెన్యూశాఖల నడుమ సమస్యల పరిష్కార ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర రెవెన్యూ,గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాలశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు ఇచ్చారు. భూ రీ-సర్వేలో జాప్యాన్ని ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. భూముల రీసర్వే నిర్ణీత గడువులోపు పూర్తిచేయాలన్నారు.
రెవెన్యూ–అటవీ–పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని, సర్వేలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి భూ సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. పాల్వంచలోని
శ్రీనివాసగుట్టను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూముల రీ-సర్వే పనుల పురోగతి, అటవీశాఖ – రెవెన్యూశాఖ భూసమస్యల పరిష్కారం, పోడు భూముల సమస్య, పాల్వంచలోని శ్రీనివాసగుట్ట అభివృద్ధి తదితరాలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 70 గ్రామాల్లో భూముల రీ-సర్వే పనులు చేపట్టగా, ప్రస్తుతం 14 గ్రామాల్లో రీ-సర్వే పనులు కొనసాగుతున్నాయన్నారు. కేవలం ఐదు గ్రామాల్లో పనులు పూర్తయ్యాయని, మిగిలిన గ్రామాల్లో కూడా గడువులోపు పూర్తిచేసేలా కార్యాచరణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. పాల్వంచలో సర్వే పనుల పురోగతిపై మంత్రి ప్రత్యేకంగా ఆరా తీసిన మంత్రి, ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంపై అసహనం వ్యక్తంచేశారు. రీ-సర్వే పనుల్లో జాప్యం, పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. భూ రీ-సర్వే ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని సూచించారు. జిల్లాలో అందుబాటులో ఉన్న సర్వేయర్లు, రోవర్ పరికరాలు, వాటి వినియోగం, సాంకేతిక సిబ్బంది వివరాలు మంత్రి, అవసరమైన చోట అదనపు వనరులు సమకూర్చాలని సూచించారు. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలను పోలీసుశాఖ గుర్తించి, ఆ భూ వివాదాలు అటవీ–రెవెన్యూ సమస్యలను సామరస్యపూర్వకంగా, చట్టబద్ధంగా పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ, అటవీ, పోలీసుశాఖలు సమన్వయంతో పనిచేసి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు.
కొత్తగా పోడు సాగు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, గతం నుంచి పోడు సాగు చేస్తున్న వారి సమస్యలను ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా, మానవీయ కోణంలో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
పాల్వంచలోని శ్రీనివాసగుట్ట అభివృద్ధిపై మంత్రి ప్రత్యేకంగా సమీక్షించిన మంత్రి గుట్టపై శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు సులభంగా చేరుకునే విధంగా రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీనివాసగుట్ట ప్రాంతాన్ని ఆధ్యాత్మిక, పర్యాటకకేంద్రంగా అభివృద్ధి చేసేలా సమగ్ర ప్రణాళిక రూపొందించి, అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లాలో భూముల రీ-సర్వే, అటవీ–రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను మంత్రికి వివరించారు. జిల్లాలో మిగిలిన గ్రామాల్లో కూడా నిర్ణీత గడువులో సర్వే పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నామని చెప్పారు. రెవెన్యూ, అటవీ, పోలీసు శాఖల సమన్వయంతో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా రీ-సర్వే ప్రక్రియ చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి, కొత్తగూడెం ఆర్డీఓ మధు, డివిజనల్ అటవీ అధికారులు, రెవెన్యూ, అటవీ, పోలీసు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Related posts

పోలింగ్ సందర్భంగా వాలంటీర్స్ నియామకం

Divitimedia

భద్రాచలం ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన మంగీలాల్

Divitimedia

ఎట్టకేలకు ‘టీజీఈడబ్ల్యుఐడీసీ’ ఖమ్మం ఈఈ నియామకం

Divitimedia

Leave a Comment