అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన పొంగులేటి

✍️ దివిటీ మీడియా (ఖమ్మం)
రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గం పరిధిలోని నేలకొండపల్లి మండలంలో శనివారం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు. రూ.177.20 లక్షల అంచనా వ్యయంతో కోనాయిగూడెం నుంచి నాచేపల్లి వయా ఆరెగూడెం, గువ్వలగూడెం, ముజ్జుగూడెం, అనాసాగరం వరకు గల బీటీ రోడ్డులో వంతెన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం సదాశివపురంలో రూ.20లక్షల వ్యయం తో నిర్మించిన గ్రామపంచాయతీ కార్యలయం భవనం, అంతకుముందు కోరట్లగూడెం గ్రామంలో రూ.16 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించారు. వివిధరకాల చిక్సితలు చేయించుకున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో అనేక రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలు, మౌళిక వసతుల అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మరికొన్ని వివిధ దశల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన ప్రతి రహదారిని దశలవారీగా సిమెంట్ రోడ్డుగా మార్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం, విద్య అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అర్హులైన పేదలకు ఇప్పటికే వైద్యసాయం అందించామన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన ఖర్చుతో సమానంగా రెండున్నరేళ్లలోనే వైద్యసాయం ప్రజలకు అందించడం సంక్షేమంపై తమ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం
విద్యారంగంలో, రైతులు, మహిళలు, నిరుద్యోగ యువతకు, పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మంత్రి వివరించారు. ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వర్షపాతం తక్కువగా ఉండే అవకాశాలున్నందున రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి నాగార్జునసాగర్‌లో లభ్యత పెరిగితే సాగునీటి సరఫరాకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రైతులు ధైర్యంగా ఉండాలని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, పీఆర్ ఎస్ఈ వెంకటరెడ్డి, ఖమ్మం ఆర్డీఓ ఎన్. శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

