పాడి పశువుల కొనుగోళ్లు నిబంధనల మేరకు నిర్వహించాలి
సమీక్షలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

✍️ దివిటీ మీడియా (ఖమ్మం)
ఇందిరా మహిళా డెయిరీ పథకం అమల్లో పరిపాలనా వ్యయాలను నియంత్రిస్తూ, నాణ్యత, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరా మహిళా డెయిరీ పథకం అమలుపై నిర్వహించిన సమీక్షసమావేశంలో జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారుల జాబితా ఖరారైన వెంటనే సంబంధిత కార్పొరేషన్ల ద్వారా రుణాల మంజూరు ప్రక్రియను పూర్తి చేయాలని, ఆ రుణాలు మంజూరైన వెంటనే ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పాడి పశువుల కొనుగోలు చేపట్టాలని సూచించారు. పాడి పశువుల కొనుగోలు ప్రక్రియలో లబ్ధిదారుల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని, లబ్ధిదారులు పరిశీలించి ఆమోదించిన పశువులనే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. కొనుగోలు బృందంలో లబ్ధిదారులతో పాటు అనుభవజ్ఞులైన పశువైద్యులు, సంబంధిత అధికారులు మాత్రమే పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతివారం 25మంది చొప్పున లబ్ధిదారులకు 50 పాడి పశువులను కొనుగోలు చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని, అదే సమయంలో నాణ్యత విషయంలోనూ ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. పరిపాలనా వ్యయాలను నియంత్రించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్న కలెక్టర్, సాధారణ పశువుల కొనుగోళ్లకు అమలుచేస్తున్న పరిపాలనా వ్యయ విధానాన్నే ఇందిరా మహిళా డెయిరీపథకం పశువుల కొనుగోళ్లలోనూ అనుసరించాలన్నారు. పరిపాలనా వ్యయాలకు ఒక ప్రామాణిక విధానాన్ని రూపొందించి నిర్ణీత పరిమితికి మించి ఖర్చు చేయరాదని స్పష్టం చేశారు. ఆ
లబ్ధిదారులకు శిక్షణ కార్యక్రమాల్లోనే తమ పాడిపశువుల కొనుగోలు తేదీలు, కొనుగోలు విధానం, లబ్ధిదారుల బాధ్యతలు, అనుసరించాల్సిన నిబంధనలపై సమగ్ర అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. పాడి పశువుల కొనుగోలు ప్రక్రియను పూర్తిగా నిబంధనల మేరకు నిర్వహించేందుకు ప్రామాణిక కార్యాచరణ విధానం(ఎస్‌ఓపీ) తక్షణమే ఖరారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి మండలంలో పాడిపశువుల కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిటీ కొనుగోలు ప్రక్రియలో నాణ్యత, పారదర్శకత, ప్రభుత్వ మార్గదర్శకాల అమలును నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.
ఈ సమావేశంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పరాస్ కుమార్, డీఆర్డీఓ శ్రీరామ్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జి.జ్యోతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎండీ.ముజాహిద్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ బి.పురంధర్, ఎంపీడీఓలు, ఏపీఎంలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

