Divitimedia
Bhadradri KothagudemCrime NewsEducationHealthLife StyleSpot NewsTelanganaYouth

స్కూల్ బస్సులు, భారీ వాహనాలపై ప్రత్యేక తనిఖీలు

స్కూల్ బస్సులు, భారీ వాహనాలపై ప్రత్యేక తనిఖీలు

మద్యం సేవించి బస్సులు నడుపుతున్న విద్యాసంస్థల డ్రైవర్లు

✍️ దివిటీ మీడియా (కొత్తగూడెం)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో, విద్యార్థుల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా కొత్తగూడెం ట్రాఫిక్ పోలీసులు స్కూల్ బస్సులు, భారీ వాహనాలపై శుక్రవారం ప్రత్యేకతనిఖీలు నిర్వహించారు. స్కూల్ బస్సులు, భారీ వాహనాలను తనిఖీ చేసి డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల ఫిట్‌ నెస్, పర్మిట్, ఇన్సూరెన్స్, ఇతర పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీలలో పాల్వంచ కేఎల్ఆర్ కాలేజీ బస్సు డ్రైవర్ ఎస్.భాస్కర్, కొత్తగూడెం ఎస్ఆర్డీజీ జూనియర్ కాలేజీ బస్సు డ్రైవర్ అజయ్ కుమార్ మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లు పోలీసులు ప్రకటించారు. వారిద్దరిపై మోటారు వాహనాల చట్టం(ఎం.వి.యాక్ట్) ప్రకారం కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. తనిఖీల్లో మొత్తం 185 కేసులు నమోదు చేశారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై తనిఖీలు ఇలా నిరంతరం కొనసాగుతాయని, ఎవరైనా మద్యంసేవించి వాహనం నడిపితే ఎం.వి యాక్ట్ లోని సెక్షన్ 185 ప్రకారం కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, వాహనాలు అతివేగంగా నడప రాదని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించరాదని, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడప కూడదని, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు భద్రతా నిబంధనలు తప్పకుండా పాటించాలని, వాహనాలునడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Related posts

సారపాక ఐటీసీలో INTUC జెండా ఎగురవేయాలి

Divitimedia

ఇసుక అక్రమార్కుల ‘అధికారిక తిరుగుబాటు’…

Divitimedia

విద్యార్థినులకు న్యాయ అవగాహన కార్యక్రమం

Divitimedia

Leave a Comment