సమస్యల పరిష్కారమే ప్రజాపాలన – ప్రగతి లక్ష్యం
చండ్రుగొండ గ్రామసభలో జిల్లాకలెక్టర్ అంకిత్

✍️ దివిటీ మీడియా
ప్రజా సమస్యల పరిష్కారంతో, గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం మార్చి 6 నుంచి అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా అమలు చేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజాపాలన – ప్రగతిప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చండ్రుగొండ మండలం తిప్పనపల్లిలో గురువారం నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్థులనుద్దేశించి మాట్లాడిన కలెక్టర్, ఈ గ్రామసభలు ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలను చేరవేసే సమర్థవంతమైన వేదికలన్నారు. విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్యం, వర్షాకాలంలో అంటువ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువవుతున్నాయన్నారు .
రానున్న వర్షాకాలంలో రైతులు పంట మార్పిడి విధానాలు అనుసరించాలని, వ్యవసాయ శాఖ సూచనల మేరకు శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. ఎరువులు, పురుగుమందుల వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండి, దిగుబడులు పెరిగేలా ఆధునిక వ్యవసాయ పద్ధతులు అనుసరించాలని ఆయన రైతులకు సూచించారు. గ్రామాల్లో సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయాలని, తడిచెత్త, పొడిచెత్త వేర్వేరుగా సేకరించే పద్ధతి అందరూ అలవర్చుకోవాలని కోరారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంచడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, అర్హులైనవారంతా ఓటరు జాబితాలో నమోదయ్యేలా అవగాహన కల్పించాలని సూచించారు. అర్హులైన వారందరికీ ఓటుహక్కు కల్పన, అనర్హుల పేర్లు జాబితాలో తొలగించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక మౌలిక వసతులు, డిజిటల్ విద్య, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, తదితర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి, రైతులు, గ్రామస్థులు పంట పొలాలకు వెళ్లే రహదారుల అభివృద్ధి, గ్రామంలోని విద్యుత్ అదనపు లైన్లు , అంతర్గత రహదారుల నిర్మాణం, తాగునీటికి ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు వంటి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలపై స్పందించిన కలెక్టర్ వెంటనే చర్యలు చేపట్టి పరిష్కారానికి కృషి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో సర్పంచ్ రామారావు, డీఆర్డీఓ విద్యాచందన, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

