తప్పులు చెరుపుకోవాలని… తప్పించుకు తిరుగుతున్నాడు…
అక్రమాల్లో మొనగాడు… అందుకే ఆఫీసు మొఖం చూడడు…
కలెక్టర్ సమీక్షకు డుమ్మాకొట్టి మరీ సరిచేసుకునేందుకు యత్నాలు…
‘టీజీఈడబ్ల్యుఐడీసీ’లో అక్రమాల అనకొండ బాగోతం
✍️ హైదరాబాదు – దివిటీ (జూన్ 29)
అవినీతి, అక్రమాల్లో పేరొందిన ఉన్నతాధికారి గతంలో చేసిన తప్పులు వెంటాడుతుంటే, తప్పించుకునేందుకు తంటాలు పడుతున్నాడు… ఏకంగా ఇరవై రోజులుగా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతూ మళ్లీ మళ్లీ మరిన్ని తప్పులు చేస్తున్నాడు… కనీసం సెలవు కూడా పెట్టకుండానే హైదరాబాదులోనే మకాంవేసి మరీ తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు… ఈ ప్రయత్నాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న అతగాడు ఏకంగా జిల్లాకలెక్టర్ సమీక్షకు కూడా ‘డుమ్మాకొట్టడం’ విశేషం… అతగాడి అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు కూడా దీని పట్ల ఉలుకూపలుకూ లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు. మరికొందరు ఉన్నతాధికారులైతే తమ స్థాయి, బాధ్యత మర్చిపోయి మరీ అతనికి ‘వత్తాసు పలుకుతున్నారు… ‘టీజీఈడబ్ల్యుఐడీసీ’లో కొంతకాలం నుంచి సాగుతున్న అవినీతి అనకొండ వ్యవహారాలపై “దివిటీ మీడియా” అందిస్తున్న ప్రత్యేక కథనం…
తెలంగాణ రాష్ట్రంలోని ప్రధానమైన రెండు జిల్లాల్లోనూ వందల సంఖ్యలో సాగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షణ చేయాల్సిన ‘టీజీఈడబ్ల్యుఐడీసీ’ అధికారి తన పనులన్నీ పక్కనపెట్టి పైరవీల్లో మునిగిపోయాడు. తనపైనున్న అక్రమాలు, అవినీతి కేసుల నుంచి ఏదో ఒకవిధంగా బయటపడాలనే ప్రయత్నాల్లో ఆయన తన విధులను ‘ఎగ్గొట్టి మరీ’ సొంత పైరవీలు, పనులకోసం రాష్ట్ర రాజధానిలో తిష్టవేసుక్కూర్చున్నాడు. జులై 8వ తేదీనుంచి ఆయన ఒక్కటంటే ఒక్కరోజు కూడా తమ ఆఫీసుకు రాలేదని ఆయన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. రెండు జిల్లాల్లో వందల అభివృద్ది పనులు పర్యవేక్షించాల్సిన ఆ ఉన్నతాధికారి కోసం అప్పటినుంచి ఆ కార్యాలయంలో వాకబు చేస్తూ వస్తున్న “దివిటీ మీడియా”కు నిరాశే మిగులుతోంది. ఆ అధికారి సెలవులో ఉన్నారో? గైర్హాజరవుతున్నారో? అనే విషయాలపై ఆ సంస్థ ఉన్నతాధికారులకు కూడా అవగాహన లేదంటే ఆశ్చర్యం కలుగుతోంది. మరోవైపు ముఖ్యమైన జిల్లాకలెక్టర్ సమీక్షకు కూడా ఆ అధికారి హాజరు కాకపోవడం, కేవలం ఆ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగిని పంపించడంతో కలెక్టర్, సీరియస్ అయి ‘షోకాజ్ నోటీసు’ జారీచేసే దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో జులై 8వ తేదీ నుంచి విధులకే హాజరుకాని అవినీతి అధికారి, జులై 24వ తేదీ నుంచి ధీర్ఘకాలిక సెలవులో వెళ్తున్నట్లు రాతపూర్వకంగా ఆ సంస్థ ఎండీ కార్యాలయంలో సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే జులై 8వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అతను విధులకు గైర్హాజరైనట్లు అర్థమవుతోంది. ఇప్పటివరకు కూడా అసలు సెలవులే పెట్టకుండా విధుల్లో ఉన్నట్లుగా దొంగ హాజర్లు వేసుకుంటున్నారు… గతంలో ‘విజిలెన్స్, ఏసీబీ’ కేసులలో విచారణ కొనసాగుతున్నప్పటికీ తన అక్రమ వ్యవహారాలను ఏమాత్రం మార్చుకోని ఆయన “అవినీతి వ్యవహారాలు” కొనసాగిస్తూనే ఉండటం పెద్ద విశేషం. ఇంత జరుగుతున్నప్పటికీ, ఈ వ్యవహారాలపై ‘దివిటీ మీడియా’ వరుస కథనాలు ప్రచురిస్తున్నప్పటికీ, ఆ సంస్థ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇటీవలే ‘టీజీఈడబ్ల్యుఐడీసీ’ వైస్ ఛైర్మన్, ఎండీ మల్లయ్య భట్టును బదిలీచేసిన ప్రభుత్వం, ఆ బాధ్యతలను ఇ.వి.నరసింహారెడ్డికి అప్పగించింది. ఆ సంస్థ రాష్ట్ర అత్యున్నతాధికారుల బదిలీల నేపథ్యంలో లభించిన వెసులుబాటు, పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకున్న ఆ ‘అవినీతి అనకొండ’ తనపై పూర్తిగా ఎలాంటి చర్యలు లేకుండా తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పనిలో తలమునకలైన అతను విధులు నిర్వర్తించకుండా, దొంగ నివేదికలతో ప్రభుత్వం, ఉన్నతాధికారులను ‘మేనేజ్’ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గతంలో ఆయన పాల్పడిన అవినీతి, అక్రమాలపై లోతైన విచారణ జరిపించాలని,ఆయనకు సహకరిస్తూ కుమ్మక్కైన సిబ్బందిపై కూడా కఠినచర్యలు తీసుకోవాలని పలువురు సామాజికవేత్తలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
***********
అవినీతిపరుడైన అధికారిపై ఇప్పటివరకు ‘దివిటీ మీడియా’ ప్రచురించిన కథనాల లింకులు…
************
అక్రమార్కులకే అందలం… అభివృద్ధికి మంగళం… https://divitimedia.com/4684/
టీజీఈడబ్ల్యుఐడీసీ అక్రమాల్లో ‘ఫ్యామిలీ ప్యాకేజి’… https://divitimedia.com/4778/
అడ్డదారిలో బయటపడేందుకు అక్రమార్కుల యత్నం https://divitimedia.com/4906/
విధులకు డుమ్మాకొట్టి… పైరవీల బాట పట్టి…
https://divitimedia.com/4967/
‘టీజీఈడబ్ల్యుఐడీసీ’లో ‘దివిటీ’ ప్రకంపనలు…
https://divitimedia.com/5001/