విధులకు ‘డుమ్మాకొట్టి’… పైరవీల బాట పట్టి…
తప్పులు స’శేషం’… చెరిపేసుకునేందుకు యత్నం
‘టీజీఈడబ్ల్యుఐడీసీ’లో అక్రమాల అధికారి బాగోతం
✍️ హైదరాబాదు – దివిటీ (జలై 16)
కేవలం లాభాపేక్ష వల్ల తాను, తన అనుచరగణంతో కుమ్మక్కై చేసిన అక్రమాలను కప్పిపుచ్చేందుకు ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు… రెండుజిల్లాల్లో వందల సంఖ్యలో సాగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షణ చేయాల్సిన ఆయన, ఆ పనులన్నీ పక్కన పెట్టి మరీ ఆ పైరవీలలో మునిగిపోయాడు… ఈ సొంత పైరవీలు, పనులకోసం రాష్ట్ర రాజధానిలో తిష్టవేసుక్కూర్చున్న ఆయన, మరోవైపు ప్రతిరోజూ విధులు నిర్వర్తిస్తున్నట్లు దొంగ హాజర్లు వేసుకుంటున్నారు… గడిచిన వారంలో ఒక్కరోజు కూడా ఆఫీసుకు గానీ, క్షేత్రస్థాయిలో పనుల పరిశీలనకు గానీ వెళ్లని ఆ అవినీతి అధికారి, కనీసం సెలవు కూడా పెట్టకుండా ‘మేనేజ్’ చేసుకుంటున్నారు… ఇంత జరుగుతున్నప్పటికీ, ఈ వ్యవహారాలపై ‘దివిటీ మీడియా’ వరుస కథనాలు ప్రచురిస్తున్నప్పటికీ, రాష్ట్ర ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇటీవలే ‘టీజీఈడబ్ల్యుఐడీసీ’ వైస్ ఛైర్మన్ అండ్ ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మల్లయ్య భట్టును బదిలీచేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ బాధ్యతలను ఇ.వి.నరసింహారెడ్డికి అప్పగించింది. ఈ అత్యున్నతాధికారుల బదిలీల నేపథ్యంలో లభించిన వెసులుబాటు, పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకున్న ఆ ‘అవినీతి అనకొండ’ తనపై పూర్తిగా ఎలాంటి చర్యలు లేకుండా తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పనిలో తలమునకలైన అతను విధులు నిర్వర్తించకుండా, దొంగ నివేదికలతో ప్రభుత్వ ఉన్నతాధికారులను ‘మేనేజ్’ చేస్తున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆయన అక్రమాలు గత కొంతకాలంగా ‘దివిటీ మీడియా’లో వరుస కథనాలతో వెలుగులోకి వస్తుండటంతో గడిచిన పదిరోజుల నుంచి ఆయన ఆఫీసుకు మాత్రం హాజరు కావడం లేదనేది స్పష్టమవుతోంది. ఆఫీసులో వాకబు చేస్తే ఆయనసలు ఆఫీసుకు రావడంలేదని తెలుస్తుండగా, సెలవు మాత్రం పెట్టలేదనే చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ అధికారి తన గత తప్పిదాలనే కొనసాగిస్తూ తప్పుడుహాజరుతో ప్రభుత్వాన్ని, అత్యున్నతాధికారులను ఏమార్చి, సొంత పైరవీలలో నిమగ్నమైనట్లు స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో చేసిన తప్పుడు పనులను కప్పిపుచ్చుకునే పనిలో ‘బిజీగా’ ఉన్న ఆయన, అత్యున్నతాధికారులను కూడా ఏమార్చి తప్పుదోవ పట్టిస్తూ, కనీసం సెలవులు కూడా పెట్టకుండా “విధులకు డుమ్మా” కొడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన అవినీతి, అక్రమాలపై లోతైన విచారణ జరిపించాలని, ఆయనతోపాటు ఇంతకాలం ఆయనకు సహకరిస్తూ కుమ్మక్కైన ఆయన సిబ్బందిపై కూడా కఠినచర్యలు తీసుకోవాలని పలువురు సామాజికవేత్తలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
************
అవినీతిపరుడైన అధికారిపై ఇప్పటివరకు ‘దివిటీ మీడియా’ ప్రచురించిన కథనాల లింకులు…
************
టీజీఈడబ్ల్యుఐడీసీ అక్రమాల్లో ‘ఫ్యామిలీ ప్యాకేజి’… https://divitimedia.com/4778/
అక్రమార్కులకే అందలం… అభివృద్ధికి మంగళం… https://divitimedia.com/4684/
అడ్డదారిలో బయటపడేందుకు అక్రమార్కుల యత్నం https://divitimedia.com/4906/