Divitimedia
Andhra PradeshBhadradri KothagudemEducationEntertainmentHealthHyderabadLife StyleNational NewsSportsSpot NewsTelanganaTravel And TourismYouth

క్రీడాస్ఫూర్తే ముఖ్యమన్న మంత్రులు వాకిటి, సీతక్క

క్రీడాస్ఫూర్తే ముఖ్యమన్న మంత్రులు వాకిటి, సీతక్క

అట్టహాసంగా ప్రారంభమైన జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు


           ✍️ దివిటీ మీడియా

క్రీడల్లో గెలుపోటములు సహజమైనవని, స్ఫూర్తిని చాటడమే ముఖ్యమని, క్రీడల్లో
గెలుపులో ఆనందం, ఓటమిలో పాఠాలు జీవితానికి మార్గదర్శకంగా చేసుకోవాలని రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి, సీతక్క సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారం గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో 69వ జాతీయస్థాయి అండర్–17 బాలుర కబడ్డీ పోటీలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో, కంది చారిటబుల్ ట్రస్ట్, మౌర్య టెక్ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ జాతీయస్థాయి క్రీడాపోటీలను రాష్ట్ర పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ప్రారంభించారు. పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ కూడా ఈ పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మణుగూరు ప్రధానకూడలి నుంచి సీఎం టార్చ్ ర్యాలీని మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించగా, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, యువకులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల ప్రాంగణంలో మంత్రులు జ్యోతి ప్రజ్వలన జాతీయపతాకావిష్కరణతో పాటు బెలూన్లను గాలిలోకి వదిలి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. మంత్రి వాకిటి శ్రీహరి దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులనుద్దేశించి “ఈస్ట్ ఆర్ వెస్ట్ – ఇండియా ఈజ్ ది బెస్ట్, ఈస్ట్ ఆర్ వెస్ట్ – బయ్యారం ఈజ్ ది బెస్ట్, భారత్ మాతాకీ జై” అంటూ నినాదాలిచ్చారు. ఈ క్రీడాసంబురం చూస్తే సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చినట్లుందని ఆయన వ్యాఖ్యానించారు. కబడ్డీ అనేది మన దేశంలోనే పుట్టిన సంప్రదాయ క్రీడ అని, మన మట్టిలో పుట్టిన ఈ ఆటలు మన సంస్కృతి, సువాసన ప్రపంచానికి చాటుతాయన్నారు. చెమట, శ్రమతో ఆడే కబడ్డీ క్రీడలో గెలుపు, ఓటములు సహజమని, క్రీడాకారులంతా క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని సూచించారు. దేశ చరిత్రలో తొలిసారిగా మారుమూల గిరిజన ప్రాంతమైన ఏడూళ్లబయ్యారం గ్రామంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లుచేయడం గర్వకారణమని అన్నారు. ఈ పోటీల ద్వారా ఏడూళ్ల బయ్యారం గ్రామం పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుందని తెలిపారు. వాజ్ పేయి ప్రధానమంత్రిగా వున్న కాలంలో భారత్–పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా “గెలుపోటములకన్నా మనసులు గెలుచుకొని రావాలి” అంటూ ఇచ్చిన సందేశాన్ని గుర్తుచేశారు. ఏడూళ్ల బయ్యారం గ్రామానికొచ్చిన క్రీడాకారులు ఇక్కడి ప్రజల మనసులు గెలుచుకొని వెళ్లాలని పిలుపునిచ్చారు. మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ, జాతీయస్థాయి కబడ్డీ పోటీలను బయ్యారం గ్రామంలో నిర్వహించేందుకు బాధ్యత తీసుకున్న కంది చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు సుబ్బారెడ్డి కుటుంబసభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ క్రీడా పోటీల నిర్వహణకోసం దాదాపు ఆరు నెలలపాటు శ్రమించి, ఏర్పాట్ల నుంచి ఆతిథ్యం వరకు అన్నీ సమర్థవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. దేశం నలుమూలల నుంచి ఇక్కడకు వచ్చిన క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించి, అనుభవం సొంతం చేసుకోవాలని సూచించారు. చిన్నపాటి తప్పిదాలతో ఓటమి పాలైనా ఓడిపోయినప్పుడు నిరాశ చెందకుండా, గెలుపు ఇచ్చే ఆనందాన్ని, ఓటమి ఇచ్చే పాఠాలను జీవితానికి అనుభవాలుగా తీసుకెళ్లాలని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చిన్నారులందరికీ ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మారుమూల గిరిజన ప్రాంతమైన బయ్యారంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. గ్రామీణ స్థాయిలో యువతలో క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఈ తరహా పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇప్పటికే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను విజయవంతంగా నిర్వహించామని, అదే విధంగా జాతీయస్థాయి పోటీలు కూడా సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అన్ని విధాలా సహకరిస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ మాట్లాడుతూ, దేశం నలుమూలల నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చి జాతీయస్థాయి కబడ్డీపోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు ఇది మరచిపోలేని అనుభవంగా నిలుస్తుందన్నారు. ఈ పోటీల ద్వారా జిల్లా ఖ్యాతి దేశవ్యాప్తంగా మరింత పెరుగుతుందని, క్రీడల నిర్వహణలో జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖాధికారి నాగలక్ష్మి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ జిల్లా అధికారి పరందామరెడ్డి, టోర్నమెంట్ అబ్జర్వర్ నిర్మల్ జంగ్డే, సర్పంచ్ చందర్రావు, కంది చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు సుబ్బారెడ్డి, విశ్వ భరత్ రెడ్డి, స్థానిక అధికారులు, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.

Related posts

గ్రూప్‌-3 పరీక్షలకు అంతా సిద్ధం : జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్

Divitimedia

రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతను ప్రశంసించిన కలెక్టర్

Divitimedia

బ్రిలియంట్స్ లో అక్టోబరు 1న జిల్లాస్థాయి నవోదయ మోడల్ పరీక్ష

Divitimedia

Leave a Comment