వచ్చీరాని వైద్యం… పోయిన విద్యార్థిని ప్రాణం
వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి
✍️ దివిటీ మీడియా (ఖమ్మం)
తన స్థాయిని మరచి… వచ్చీరాని వైద్యం చేసి ఓ చిన్నారి నిండుప్రాణం బలిగొన్నాడో దుర్మార్గుడు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి… కొణిజర్లలో కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని జలుబు, జ్వరంతో అస్వస్థతకు గురైంది. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఆ బాలికను సోమవారం స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు చికిత్స చేయించేందుకు తీసుకెళ్లారు. వచ్చీరాని వైద్యంతో తనకు అర్హత లేని చికిత్సలో భాగంగా ఆర్ఎంపీ వైద్యుడు ఆ బాలిక చేతికి ఓ ఇంజక్షన్ ఇచ్చాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఇంజక్షన్ చేసిన అనంతరం ఆ బాలికకు శ్వాసతీసుకోవడంలో ఇబ్బందికలగడం వల్ల కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఈసీజీ, ఇతర వైద్యపరీక్షలు నిర్వహించి, ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆ బాలిక తండ్రి ఆర్ఎంపీ వైద్యుడిపైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ బాలికకు వైద్యం చేసిన సమయంలో ఆర్ఎంపీ వైద్యుడు మద్యం సేవించి ఉన్నాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఆర్ఎంపీ వైద్యుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరుగకుండా ఆ ఆర్ఎంపీ వైద్యుడి మీద కఠినచర్యలు తీసుకోవాలని బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

