Divitimedia
Bhadradri KothagudemEducationHealthLife StylePoliticsSpot NewsTelanganaWomen

‘ఐసీడీఎస్’ నిర్లక్ష్యం… ఎమ్మెల్యే ఆగ్రహం…

‘ఐసీడీఎస్’ నిర్లక్ష్యం… ఎమ్మెల్యే ఆగ్రహం…

అవగాహనలేని అధికారులతో అభివృద్ధి సాధ్యమేనా?

ఎమ్మెల్యే సమీక్షలో బయటపడిన అధికారుల తీరు

✍️ దివిటీ మీడియా – సెప్టెంబరు 15

‘ఐసీడీఎస్ సిబ్బంది పనితీరుపై నాకెన్నో ఫిర్యాదులొస్తున్నాయి… వాటి గురించి అడగుదామంటే సీడీపీఓ రాలేదు… ఏమీ తెలియని సిబ్బంది ఇక్కడకు వచ్చి ఏం సమాధానం చెప్తారు?… అంగన్వాడీలపై అసలు పర్యవేక్షణ లేదు… మీ వల్ల మా ప్రభుత్వం నవ్వులపాలయ్యే పరిస్థితి…’ అంటూ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తీవ్ర అసహనంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. బూర్గంపాడులో స్థానిక రైతువేదికలో సోమవారం నిర్వహించిన మండలస్థాయి అధికారుల సమీక్షకు ఐసీడీఎస్ పీఓ రేవతి గైర్హాజరు కావడం పట్ల ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ లోపించిందని, తన దృష్టికి అనేక ఫిర్యాదులొస్తున్నాయని చెప్పిన ఎమ్మెల్యే, పనితీరు మార్చుకోక పోతే పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఒక్కొక్క ప్రభుత్వ శాఖ వారీగా ఎమ్మెల్యే పాయం నిర్వహించిన సమీక్షలో అధికారుల అవగాహనారాహిత్యం బయటపడింది. కీలకమైన రెవెన్యూశాఖ తరఫున ఏం జరుగుతున్నదో చెప్పేందుకు తహసీల్దార్ సమావేశానికి రాలేదు. ఆ సమావేశంలో హాజరైన డెప్యూటీ తహసీల్దారు సమ్మయ్య, వివరాలేమీ చెప్పలేకపోయారు. ట్రాన్స్ కో తరపున సమీక్షలో పాల్గొన్న ఏఈ ఉపేందర్, మండలంలో విద్యుత్తు సరఫరా వ్యవస్థల వివరాలు చెప్పలేక పోవడంపై ఎమ్మెల్యే తీవ్ర అసహనంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమీక్షలో పాల్గొన్న పలువురు అధికారులకు తమ తమ శాఖలపై కూడా పట్టులేకపోవడం బయటపడింది. ఈ దుస్థితిపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పలుమార్లు ఆయా శాఖ‌ల అధికారులపై తీవ్ర అసహనంతో వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తమ విధులకు సంబంధించిన అంశాలపై అవగాహన లేని అధికారుల కారణంగా తమ ప్రభుత్వం ‘నవ్వులపాలయ్యే’ దుస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు పూర్తి అవగాహన, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని కోరారు. ఎమ్మెల్యే సమీక్ష సమావేశానికి పలు శాఖల అధికారులు గైర్హాజరయ్యారు. సోమవారం ‘ఇంజనీర్స్ డే’ సందర్భంగా అక్కడున్న ఇంజినీరింగ్ అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, వారిని సత్కరించారు. ఈ సమీక్షలో ఎంపీడీఓ జమలారెడ్డి, డెప్యూటీ తహసీల్దార్(డీటీ) సమ్మయ్య, పంచాయతీరాజ్ శాఖ డీఈ వెంకటేశ్వర్లు, పి.హెచ్.సి వైద్యాధికారి డా.సాహితి, ఎంఈఓ యధుసింహరాజు, ఏఓ శంకర్, ఐకేపీ ఏపీఎం హేమంతిని, వివిధ శాఖల ఏఈలు చక్రధరాచారి, సాయికిరణ్, నారాయణ, సందీప్, ఈజీఎస్ ఏపీఓ వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన

Divitimedia

ఏజెన్సీలో గిరిజనేతరులకు గృహలక్ష్మి వర్తింప చేయాలి

Divitimedia

ప్రతి కేసులో సమగ్రంగా దర్యాప్తు చేయాలి

Divitimedia

Leave a Comment