జిల్లాలో విపత్తు అధ్యయన బృందం విస్తృత పర్యటన

✍️ దివిటీ – భద్రాద్రి కొత్తగూడెం (నవంబరు 21)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విపత్తు కార్యాచరణ ప్రణాళికపై హ్యాండ్‌బుక్ రూపొందించేందుకు శాస్త్రీయ ఆధారాలు, క్షేత్రస్థాయి పరిస్థితుల అధ్యయనం కోసం ఇండియా హౌస్ ప్రతినిధి బృందం శుక్రవారం విస్తృతంగా పర్యటించింది. జాహ్నవి, సోనల్ ఘోడ్గే, మురళి (డిప్యూటీ కలెక్టర్)లతో కూడిన బృందం సహజ వనరులు, పర్యావరణ వ్యవస్థ, అటవీ సంరక్షణ, పరిశ్రమల ప్రభావం, వాతావరణ మార్పుల నేపథ్యం వంటి అంశాలను పరిశీలిస్తూ పలు ప్రాంతాల్లో ప్రత్యక్ష సమాచారం సేకరించింది. బృంద సభ్యులు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలోని నర్సరీలు, గనుల తవ్వకంతో కోల్పోయే అడవులను పునరుద్ధరణ చర్యలు, శాస్త్రీయ పద్ధతుల్లో పెంచుతున్న వివిధ జాతుల మొక్కలు, పునరావాసం చేసిన గనుల ప్రాంతాల్లో అమలు చేస్తున్న జీవ వైవిధ్య సంరక్షణ కార్యక్రమాల తీరును పరిశీలించింది. పర్యావరణ పరిరక్షణకు సింగరేణి సంస్థ చేపడుతున్న చర్యలలో నాణ్యతా ప్రమాణాలను కూడా బృందం అధ్యయనం చేసింది. కిన్నెరసానిడ్యామ్, అభయారణ్యంలో అరుదైన జాతులకు చెందిన వృక్షాలు, జంతువులు, అటవీ సంరక్షణ పథకాలు, అడవుల నరికివేత వల్ల వాతావరణ మార్పులపై పడుతున్న ప్రభావం వంటి అంశాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. కిన్నెరసాని డ్యామ్ నీటి నిల్వలు, వరద నియంత్రణ వ్యవస్థ, జలవనరుల నిర్వహణ విధానాలు, డ్యామ్ భద్రత ప్రమాణాలను బృందం సమీక్షించింది. జిల్లా అటవీశాఖ అధికారి కృష్ణగౌడ్‌తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లాలో అడవుల ప్రస్తుత స్థితి, చెట్ల నరికివేత నియంత్రణ చర్యలు, వాతావరణ మార్పుల వల్ల సంభవించే సహజ విపత్తుల ప్రభావం, వరదలు, నేలధూపాన్ని నిరోధించేందుకు చేపట్టాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. మాదారం గ్రామంలోని నాయకపోడు మాస్క్ తయారీ కేంద్రాన్ని పరిశీలించి, మాస్క్ తయారీలో వినియోగించే చెక్క మూలాలు, వాటి వల్ల అడవులపై పడే ప్రభావం, పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాల అమలు వంటి అంశాలను ఈ బృందం సమీక్షించింది. దమ్మపేటలోని ఆయిల్ పామ్ పరిశ్రమను సందర్శించి, ఉత్పత్తి విధానాలు, పరిశ్రమ వ్యర్థాల నిర్వహణ, కాలుష్యనియంత్రణ చర్యలపై వివరాలు అధ్యయనం చేశారు. ఈ సమాచారాన్ని జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ ఆధ్వర్యంలో చేపట్టనున్న జిల్లా విపత్తు కార్యాచరణ ప్రణాళిక హ్యాండ్‌బుక్ తయారీలో ప్రధాన ఆధారాలుగా ఉపయోగించనున్నారని అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

