అస్తవ్యస్త పార్కింగ్ అవస్థలకు కాస్త ఊరట

లక్ష్మీపురం పారిశ్రామిక ప్రాంతంలో దుస్థితికి చెక్
✍️ దివిటీ మీడియా (పినపాక)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం పారిశ్రామిక ప్రాంత ప్రధాన సమస్యగా ఉన్న ప్రమాదకరమైన పరిస్థితులకు పోలీసులు ఎట్టకేలకు కాస్త ఊరటనిచ్చే చర్యలు తీసుకున్నారు. ఈ ప్రాంతంలో జాతీయ రహదారి వెంబడి ఓ జాతరలాగా లారీలు, రవాణా వాహనాల ‘పార్కింగ్’ వల్ల ప్రయాణికులు, స్థానికులు పలు సమస్యలెదుర్కొంటున్నారు. ప్రతి రోజు ఇక్కడ పెద్దసంఖ్యలో లారీల వంటి రవాణా వాహనాలు ప్రధాన రహదారిపై నిలిపి ఉంచుతున్నారు. ప్రధానంగా ఈ అస్తవ్యస్త పార్కింగ్ పలు ప్రమాదాలకు దారితీస్తోంది. రహదారికి ఇరువైపులా నిలిపి ఉంచిన లారీల వల్ల ఆ ప్రాంతంలో జాతీయ రహదారి ఇరుకుగా మారుతూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డుపైనే నిలిపి ఉంచిన వాహనాల చాటు నుంచి రోడ్డుమీదకు వస్తున్న మనుషులు గాయ పడుతున్నారు. మరోవైపు వేగంగా వెళ్లే వాహనదారులకు కూడా ప్రమాదకరంగా మారింది. ఇంకొక ముఖ్యమైన సమస్య ఇక్కడ రోడ్డు అంచులపై నిలిపి ఉంచిన లారీల వల్ల పెద్ద పెద్ద గోతులేర్పడి, నీటి మడుగులుగా మారుతున్నాయి. అక్కడి నుంచి రోడ్డుపైకి వస్తున్న వాహనాలతో పాటే రోడ్డుమీదకు బురద చేరిపోతోంది. ఈ బురదమట్టి ఎండిపోయిన తర్వాత రోడ్డుపై విపరీతమైన దుమ్ముగా మారి పైకి లేస్తోంది. ముందువెళ్తున్న వాహనాల వల్ల దుమ్ము విపరీతంగా పైకి లేస్తుంటే ఆ వాహనాల వెనుక వెళ్తున్న ప్రయాణికులు దుమ్ము ధూళితో అవస్థలు పడుతున్న దుస్థితి తలెత్తింది. మరీ ముఖ్యంగా ఈ మార్గంలో రహదారులపై మోటార్ సైకిళ్ల మీద, ఆటోల్లో గానీ ద్విచక్ర వాహనాల మీద గానీ ప్రయాణించే వారిపై దుమ్ము పడుతూ ఇబ్బందిపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ మార్గంలో ప్రతిరోజూ ప్రయాణిస్తున్నవారు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. వర్షాకాలంలో ఈ దుమ్ము సమస్య విపరీతంగా ఉంటోంది.
——————
పోలీసుల ‘నోపార్కింగ్’ బోర్డులతో కాస్త ఊరట దక్కనుంది
——————
ప్రస్తుతం లక్ష్మీపురం పారిశ్రామిక ప్రాంతం లో రోడ్లపై వాహనాలు నిలిపివేయకుండా బూర్గంపాడు పోలీసులు ‘నో పార్కింగ్’ బోర్డులు ఏర్పాటు చేయడంతో ఊరట కలిగిస్తోంది. బూర్గంపాడు ఎస్సై మేడా ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం పది ‘నో పార్కింగ్’ బోర్డులు ఏర్పాటుచేశారు. ఈ ప్రదేశంలో ప్రమాదాలు నివారించడంతో పాటు విపరీతమైన దుమ్ము బెడదకూడా తొలగిపోయేందుకు పోలీసుల చర్యలు దోహదపడుతాయని స్థానికులతోపాటు, ఈ మార్గంలో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

