మూడేళ్లలో అర్హులందరికీ ఇళ్లు, ఆర్థిక భరోసా లక్ష్యం

ఆత్మకమిటీ ప్రమాణ స్వీకారంలో మంత్రి పొంగులేటి

✍️ దివిటీ మీడియా – సెప్టెంబరు 24
వచ్చే మూడేళ్లలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడంతోపాటుగా ఆర్థికభరోసా కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలో నిర్వహించిన ‘ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవెల్లి వీరభద్రరావు, 24 సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 966 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. కళ్యాణలక్ష్మి – షాదీముబారక్ పథకం కింద 19 లబ్ధిదారులకు రూ.19.02 లక్షలు చెక్కుల రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాకలెక్టర్ జి.వి. పాటిల్, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, కొత్తగూడెం ఆర్డీఓ మధు, గ్రంథాలయ చైర్మన్ వీరబాబు, హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి బాబురావు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, రైతులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

