Divitimedia
Bhadradri KothagudemHyderabadLife StyleNational NewsSpot NewsTelanganaTravel And Tourism

ముక్కోటి మహోత్సవాలు విజయవంతం చేయాలి

ముక్కోటి మహోత్సవాలు విజయవంతం చేయాలి

ఏర్పాట్లపై సమీక్షలో కలెక్టర్ జి.వి.పాటిల్

✍️ దివిటీ – భద్రాచలం (నవంబర్ 20)

అధికారులందరూ సమన్వయంతో పని చేసి ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు సజావుగా ప్రశాంతంగా విజయవంతం మయ్యేలా కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ కోరారు. గురువారం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ముక్కోటి ఏకాదశి ఉత్సవాల ఏర్పాట్ల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడి, దిశానిర్దేశం చేశారు. నిర్దేశించిన పనులు ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అధికారులు సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం దేవస్థానం, రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. తెప్పోత్సవం, ఉత్తర ద్వారదర్శనం సందర్భంగా పోలీసుశాఖ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా నామమాత్రపు ధరలతో సౌకర్యాలు కల్పించే విధంగా లాడ్జీలు, హోటళ్ల యజమానులతో సమావేశం నిర్వహించి ధరల నిర్ణయించాలని సబ్ కలెక్టరుకు సూచించారు. ఆలయ పరిసరాల్లో సీసీ టీవీల ఏర్పాటుకు ఆదేశించారు. భద్రాచలం, పర్ణశాలలో దేవాలయాలను విద్యుద్ధీపాలతో అలంకరించాలని సూచించారు. భక్తులు మహోత్సవాలు వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయాలని, హంసవాహనం తనిఖీ చేసి దృవీకరణ నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ ఈఈని ఆదేశించారు. హంస వాహనంలోకి పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించాలని, భక్తులు గోదావరి నదిలోకి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆహార పదార్థాల నాణ్యత తనిఖీచేసి నివేదిక అందజేయాలని ఫుడ్ ఇన్సెక్టర్, తూనికలు, కొలతల అధికారులను ఆదేశించారు. భద్రాచలం, పర్ణశాలలో ప్రత్యేక టీమ్స్ తో పారిశుద్ధ్యం పనులు చేపట్టాలని సూచించారు. ప్రతి సెక్టార్‌కు ఏర్పాట్ల పర్యవేక్షణకు జిల్లాస్థాయి ప్రత్యేకాధికారులను నియమించనున్నట్లు తెలిపారు. భక్తులకు సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని చెప్పారు. భక్తులకు బస్సులు, రైల్వే సమయాలు, జిల్లాలోని ప్రముఖ దర్శనీయ స్థలాల వివరాలు తెలియజేసే చార్టులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశమున్నందున ఎలాంటి లోటుపాట్లు రాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. వాహనాల పార్కింగ్ స్థలాలకు సైనేజ్ బోర్డ్స్ ఏర్పాటు చేయాల‌న్నారు. భద్రాచలం కరకట్ట, తెప్పోత్సవం, వైకుంఠ ద్వారదర్శనం ప్రాంతాల్లో టాయిలెట్లు ఏర్పాట్లు చేయాలని, ప్రస్తుతం భక్తుల కోసం ఏర్పాటుచేసిన టాయిలెట్లు సరిపడా ఉండేలా చూసుకోవాలని, అవసరమైతే ఐటీసీ సంస్థ సహకారంతో టెంపరరీ టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఏకాదశి కార్యక్రమాలతోపాటు భక్తులు దర్శనీయస్థలాలకు వెళ్లే విధంగా తగిన సమాచారం అందించాలని కోరారు. భద్రాచలం పర్యాటకకేంద్రంగా అభివృద్ధి పర్చేందుకు బొజ్జిగుప్ప, బెండాలపాడు, రథంగుట్ట, పగిడేరు ప్రాంతాలను దర్శించే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. గిరిజన సాంప్రదాయ వంటకాలు, వస్తువులతో ఎస్.హెచ్.జి మహిళలు, ఆదివాసీ గిరిజన మహిళలతో గోదావరి కరకట్టపై స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రదర్శించేలా చూడాలని కోరారు. ఎక్సైజ్ శాఖ తరపున తెప్పోత్సవం, ఉత్తర ద్వారదర్శనం పూర్తయ్యే వరకు భద్రాచలంతోపాటు ఎటపాక వరకు మద్యం షాపులన్నీ బంద్ చేయాలని ఆదదేశించారు. ఐటీసీ సహకారంతో గ్రామపంచాయతీ సిబ్బంది సమన్వయంతతో గోదావరి బ్రిడ్జిపై స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. భక్తులు ప్లాస్టిక్ కవర్లు వినియోగించకుండా చూసి, జూట్ బ్యాగులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పంచాయతీ సిబ్బంది భద్రాచలం పట్టణంలో డస్ట్ బిన్లు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సంవత్సరం గోదావరిలో బోటింగ్ పాయింట్లో లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచి, గజఈతగాళ్లను సిద్ధం చేసి పర్యాటకులు నామమాత్రం రుసుముతో గోదావరిలో విహరించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు సరిపడా ప్రసాదం, లడ్డు కౌంటర్లు ఏర్పాటు చేయాలని, యాత్రికులు, చిన్నపిల్లలు తప్పిపోతే సమాచారం అందించడానికి ప్రధానమైన కూడళ్లలో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.
సమావేశంలో ఐటీడీఏపీఓ బి.రాహుల్, సబ్ కలెక్టర్ మృణాలిశ్రేష్ట, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ఆలయ ఈఓ దామోదర్ రావు, కొత్తగూడెం ఆర్డీఓ మధు, పాల్వంచ డీఎస్పీ సతీష్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

Divitimedia

అడుగడుగునా అవకతవకలమయంగా ఈజీఎస్

Divitimedia

అడవిలో పడేసిన హరితహారం మొక్కలకు బాధ్యులెవరో?

Divitimedia

Leave a Comment