పరమ దరిద్రంగా నేషనల్ హైవే-30 నిర్వహణ

నిర్వహణపై ముగిసిన నిర్మాణ సంస్థ గడువు… ?
నిర్వహణ పనులకు కొత్తగా టెండర్ పిలిచిన ప్రభుత్వం
✍️ దివిటీ మీడియా – సెప్టెంబరు 25
ఓవైపు ‘జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ’ ఎంతగా సూచనలు చేస్తున్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జాతీయ రహదారి (నెంబర్-30) నిర్వహణ పరమ అధ్వాన్నంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. విజయవాడ – భద్రాచలం – కుంట జాతీయ రహదారిలో ఈ జిల్లాలోని ‘రుద్రంపూర్- భద్రాచలం’ సెక్షన్ పరిస్థితుల్లో మార్పు కానరావడం లేదు. మహారాష్ట్రకు చెందిన ఓ నిర్మాణ సంస్థ చేపట్టిన ఈ రహదారి ప్రాజెక్టు పని దాదాపు ఐదేళ్ల క్రితమే పూర్తయింది. ఆ తర్వాత ఇప్పటివరకు (ఐదేళ్లపాటు) ఈ రహదారి నిర్వహణ బాధ్యత ఆ నిర్మాణ సంస్థదేనని తెలుస్తోంది. నిర్మాణపనుల్లో లోపాలున్నాయంటూ పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇపప్పటివరకు ఈ రహదారి నిర్వహణ కూడా అధ్వాన్నంగా ఉంటూ వచ్చింది. ప్రధానంగా నిర్మాణం సమయం నుంచి కొనసాగుతున్న కొన్ని లోపాలతో బూర్గంపాడు మండలంలో ఈ జాతీయరహదారి నిర్వహణ కూడా లోప భూయిష్టంగానే ఉంటోంది. బూర్గంపాడు మండలంలోని పినపాక పట్టీనగర్ వద్ద కిన్నెరసాని వంతెనపై, అప్రోచ్ రోడ్డుపై గోతులు అలానే ఉంటున్నాయి. తర్వాత అంజనాపురంలో మలుపులో దెబ్బతిన్న రహదారి అంచు ఎప్పుడూ అదేరీతిలో దర్శనమిస్తోంది. అంజనాపురం తర్వాత జింకలగూడెం మధ్యలో సీతారామ ప్రాజెక్టు కాలువపై నిర్మించిన వంతెనపై కూడా ఎప్పుడూ గోతులుంటున్నాయి. మోరంపల్లిబంజర సెంటర్లోనూ గోతులు అలానే ఉంటున్నాయి. ఇవన్నీ ఒకెత్తైతే పోలవరం గ్రామంవద్ద ఎప్పుడుచూసినా రోడ్డు పెద్ద పెద్ద గోతులతో నిండిపోయి చిన్న వాహనాలకు అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. లక్ష్మీపురం గ్రామంలో, ముసలిమడుగు గ్రామంలో, ఆ తర్వాత సందెళ్లరామాపురంలోనూ జాతీయ రహదారి పెద్ద పెద్ద గోతులతో ప్రమాదకరంగా మారింది. ఈ దుస్థితిలో ఆయా ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో కొంతమంది ప్రాణాలు పోగొట్టుకోగా, అనేకమంది గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో జాతీయరహదారి నిర్వహణ పట్ల ఉన్నతాధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని, ప్రమాదాలను నివారించి ప్రయాణీకుల ప్రాణాలు కాపాడాలని ఈ ప్రాంత ప్రజలు, ప్రయాణీకులు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.
###########
నిర్వహణ టెండర్ల ప్రక్రియపై గంపెడు ఆశలు…
###########
ప్రమాదభరితంగా కొనసాగుతున్న 30వ నెంబర్ జాతీయరహదారిలో రుద్రంపూర్ – భద్రాచలం సెక్షన్లో ఏడాదిపాటు రూ.4.42కోట్లతో నిర్వహణ పనులకు ఇటీవల టెండర్లు పిలిచారు. కిలోమీటర్ నెం.121 నుంచి కిలోమీటర్ నెం.171.6 వరకు (50.6 కిలోమీటర్లు) రహదారిపై ఏడాదిపాటు నిర్వహణ చూసేందుకు ఈ టెండర్ పిలిచారు. ఈ నేపథ్యంలోనే ఈ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఏమేరకు వస్తారో అర్థంకాని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. నిర్మాణ పనుల్లో లోపాలతో నిర్వహణ భారంగా మారుతున్నదనే భావన ఏర్పడినట్లు సమాచారం. దీనికి తోడు అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపు ప్రక్రియలో చోటుచేసుకుంటున్న జాప్యం కూడా కాంట్రాక్టర్లు వెనకడుగు వేసేందుకు కారణంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఉన్నతాధికారులు ప్రత్యేకచర్యలు చేపట్టి ఈ జాతీయ రహదారి నిర్వహణపనులు సక్రమంగా జరిగేవిధంగా చూడాల్సిన అవసరముంది. ఈ పనుల విషయంలో పూర్తి వివరాల కోసం ‘దివిటీ మీడియా’ కొత్తగూడెం డీఈ శైలజను ఫోన్ ద్వారా సంప్రదించగా, తన వద్ద సమాచారం లేదని చెప్పారు.

