సారపాకలో భూవివాదంపై రచ్చ రచ్చ…

కాంగ్రెస్ నాయకుడిపై ఎమ్మెల్యేకు మహిళల ఫిర్యాదు…
✍️ దివిటీ మీడియా – సెప్టెంబరు 24
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని గాంధీనగర్ ప్రాంతంలో భూవివాదంపై బుధవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కార్యక్రమంలో రచ్చ రచ్చ జరిగింది. బూర్గంపాడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దుగ్గెంపూడి కృష్ణారెడ్డిపై గాంధీనగర్ ప్రాంత మహిళలు ఎమ్మెల్యే పాయంకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే, విచారణ చేయాలని మండల తహసీల్దారు ప్రసాద్ కు అప్పగించారు. అక్కడ ఓ గుడికి చెందిన స్థలం ఆక్రమించేందుకు కృష్ణారెడ్డి, మరికొందరు వ్యక్తులతో కలిసి తమపై దౌర్జన్యం చేయిస్తున్నాడని యారంకోట శుభ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అక్కడకు వచ్చిన ఇతర మహిళలు కూడా దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యారంకోట శుభ మీడియాతో మాట్లాడుతూ, అసలు కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండేందుకు అనర్హుడని, అతని వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, శుభతోపాటు మహిళలు చేసిన ఆరోపణలపై అక్కడే ఉన్నప్పటికీ దుగ్గెంపూడి కృష్ణారెడ్డి స్పందించలేదు. ఈ వ్యవహారమంతా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కార్యక్రమంలోనే, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలోనే జరగడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

