ఉపాధిహామీ కూలీలకు సామగ్రి పంపిణీ చేసిన ఎమ్మెల్యే

✍️ దివిటీ మీడియా – సెప్టెంబరు 24
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ఉపాధిహామీ పథకం కింద కూలీలకు బుధవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా గడ్డపారలు, తట్టలు పంపిణీ చేశారు. స్థానిక ఎంపీడీఓ జమలారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తమ ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పడిన ప్రజా ప్రభుత్వమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నిర్మించిన ‘ఇందిరమ్మ మోడల్ హౌస్’ ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మొక్కలు కూడా మండలంలో పేదలకు 520 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని, 160 ఇందిరమ్మ ఇళ్లు కేవలం గిరిజనులకు మంజూరు చేశామని చెప్పారు. తహసిల్దార్ ప్రసాద్ మాట్లాడుతూ, భూభారతిలో ఎకరాకు కేవలం రూ.2500 మ్యుటేషన్ ఫీజుతో పట్టాలిస్తున్నామని తెలిపారు. త్వరలో సాదాబైనామాల ప్రక్రియ చేపడతామని వివరించారు. మండల వ్యవసాయశాఖ అధికారి శంకర్ వ్యవసాయశాఖ పని తీరు వివరించారు. ఉపాధిహామీ పథకం ఏపీఓ వెంకటలక్ష్మి మాట్లాడుతూ 18 గ్రామ పంచాయతీల పరిధిలోని 35 హ్యాబిటేషన్లలో వనమహోత్సవంలో 2,69,000 మొక్కలు నాటినట్లు చెప్పారు. పశువుల షెడ్లు, కోళ్లఫారాలు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. 3107 కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మంజూరైందని తెలిపారు. జింకలగూడెం వద్ద 10కుంటల్లో మోడల్ ఫార్మింగ్ చేపట్టామని, కూలీలకు 1377 గడ్డపారలు, 2754 తట్టలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. బూర్గంపాడు ప్రభుత్వాసుపత్రి నూతన భవనాల నిర్మాణపనులు పరిశీలించిన ఎమ్మెల్యే, పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. మండలంలో ప్రధానమైన ఆర్.అండ్.బి రహదారులకు మరమ్మతులు చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం హేమంతిని, మాజీ ఎంపీపీ రోసిరెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

