ప్రజాపాలనలో ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యం
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
✍️ దివిటీ మీడియా – సెప్టెంబరు 17
ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యతనిస్తూ, అట్టడుగు వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలన అందిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ లో ఆయన జాతీయపతాకావిష్కరణ చేసి ప్రసంగించారు. తెలంగాణ చరిత్రలో గర్వ కారణమైన 1948 సెప్టెంబర్ 17వ తేదీ హైదరాబాదు సంస్థానం భారతదేశంలో విలీనమైన చారిత్రకఘట్టాన్ని గుర్తు చేస్తుందని తెలిపారు. స్వాతంత్ర్య సమర యోధులు, అమరవీరులు, ప్రజా పోరాట యోధుల త్యాగం వల్లనే నేడు ప్రజాస్వామ్య విలువలు స్థిరపడ్డాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే పాలకులు, ప్రజలే అధిపతులనే స్ఫూర్తిని అందరికీ గుర్తు చేస్తుందన్నారు.
రాష్ట్ర అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దార్శినికత, నాయకత్వంలో ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. విద్యుత్తు, నీటిపారుదల, వ్యవసాయం,పరిశ్రమలు, ఐటీ,ఉపాధి, సంక్షేమరంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. ఇందిరమ్మ ప్రజాపాలనలో ప్రజల హక్కులు కాపాడబడుతున్నట్లు తెలిపారు. రైతురుణమాఫీ, రైతుభరోసా, రైతుభీమా వంటి పథకాల ద్వారా రైతు సంక్షేమానికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్ట్‌తో నీటి కల నెరవేరిందని, ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ స్థాపన జిల్లాకు ఖ్యాతి తెచ్చిందని, భద్రాచలానికి రాకపోకల సౌకర్యం కల్పించేలా రైల్వే లైన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్, రింగ్ రోడ్, బైపాస్ రోడ్, నేషనల్ హైవే పనులు కూడా ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. సింగరేణిసంస్థను బలోపేతం చేయడం, భవిష్యత్‌లో థర్మల్, సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా ఐడీఓసీ సమావేశమందిరంలో జరిగిన విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి , విశ్వకర్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భగవాన్ విరాట్ విశ్వకర్మ ఆవిష్కరణలు, శిల్పకళ, శ్రమవిలువను గుర్తిస్తూ ప్రజలు ఆయనను అద్యబ్రహ్మగా పూజిస్తున్నట్లు తెలిపారు. బడుగు, బలహీన వర్గాలు, కూలీలు, శ్రమజీవులు, చేతివృత్తిదారుల ప్రతిభ, కృషి వల్లనే సమాజం ముందుకు సాగుతుందని, వారి అభివృద్ధికోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీసీల కులగణన కూడా ఈ వర్గాలకు గౌరవ ప్రదమైన స్థానం కల్పించడానికి చేపట్టిన ఒక చారిత్రక అడుగు అని తెలిపారు. ఈ కులగణనను అందరూ సమర్దించాలని, అట్టడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు, కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. సంక్షేమ పథకాలు ప్రతి వర్గానికి చేరేలా చూడటం అందరి బాధ్యతని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్, జిల్లా అటవీశాఖ అధికారి కృష్ణ గౌడ్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా బీసీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, అధికారులు, ఉద్యోగులు, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

