Divitimedia
Bhadradri KothagudemBusinessCrime NewsLife StyleSpecial ArticlesTelanganaWomen

ఇంతకీ ఇసుక అక్రమ రవాణా ఆపేదెవరు…?

ఇంతకీ ఇసుక అక్రమ రవాణా ఆపేదెవరు…?

శాఖల మధ్య సమన్వయలోపమే ఇక్కడ శాపం

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (మే 23)

‘ఊరుమ్మడి ఆస్తికి.. అందరూ యజమానులే..!’ అన్న చందంగా తయారైంది ఇసుక, మట్టి, రాళ్ల వంటి సహజవనరుల పరిస్థితి… ‘ఎవరికి అందిన కాడికి వాళ్లు దోచుకుపోవడమే..’ అన్నట్లుగా సాగిపోతున్న సహజవనరుల దోపిడీ దందాను అడ్డుకునేవారే కరవైన దుస్థితి నెలకొంది. ఈ అక్రమ దందాలో ముఖ్యమైనది ఇసుక కాగా, ఆ తర్వాత రెండో స్థానంలో మట్టి కొనసాగుతోంది. గోదావరి, కిన్నెరసాని నదీ పరివాహక ప్రాంతమైన బూర్గంపాడు మండలంలో ఈ అక్రమ దందాలు యధేచ్ఛగా కొనసాగిపోతున్నాయి. అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్న ఈ అక్రమదందా స్థానిక సంస్థలకు, ప్రభుత్వానికి భారీగా నష్టం కలిగిస్తోంది. ప్రజలకు ఉపయోగపడే సహజవనరుల సంరక్షణ, ప్రభుత్వానికి సంపద పెంపుదల కోసం కృషి చేయాల్సిన అధికారులు కూడా ఈ అక్రమార్కులతో దోస్తీ కడితే ఎంతటి దుస్థితి తలెత్తుతుందో చెప్పనక్కరలేదు. దీనికి బూర్గంపాడు మండలంలో సాగుతున్న ఇసుక, మట్టి అక్రమ దందా ఉదాహరణగా నిలుస్తోంది. మండలంలో ఓవైపు గోదావరి నది నుంచి సారపాక, గొమ్మూరు, తాక్లగొమ్మూరు, మోతె, ఇరవెండి ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగిపోతోంది. మరో పక్క బూర్గంపాడు, గౌతంపురం, సోంపల్లి, బుడ్డగూడెం, పినపాక పట్టీనగర్, ఉప్పుసాక ప్రాంతాల్లోనూ కిన్నెరసాని నదిలో ఇదే రకమైన తంతు సాగుతోంది.
——‐————‐—————–
అసలు అక్రమ రవాణా ఆపే బాధ్యత ఎవరిది?
—————–‐——————-
అక్రమ, మట్టి ఇసుక రవాణా జోరుగా సాగిపోతుంటే అధికారులు తమ తమ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు నటిస్తున్నారు. సహజ వనరుల అక్రమ రవాణాను నిలువరించే అధికారం, బాధ్యత రెవెన్యూ, పోలీసు, గ్రామ పంచాయతీ, మైనింగ్, ఇరిగేషన్, అటవీ శాఖల అధికారులకు ఉంది. ఎక్కడెక్కడ ఇసుక, మట్టి అక్రమంగా తరలిస్తున్నారో ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అక్రమ రవాణా అడ్డుకోవాల్సిన బాధ్యత ఉంది. కాకపోతే బూర్గంపాడు మండలంలో ఎవరికివారు ఆ బాధ్యత తమది కాదంటూ తప్పించుకుంటున్నారు. తమ ‘పవర్ చూపించుకుని’ అక్రమార్కులను దారికి తెచ్చుకునేందుకు అడపాదడపా దాడులు చేస్తున్న అధికారులు, ఆ తర్వాత వారితోనే దోస్తీ కట్టి తాము కూడా దోచుకుంటున్న ఉదంతాలు అక్రమ రవాణాదారులకు మరింత బలం చేకూర్చుతున్నాయి. గతంలో ప్రభుత్వం మండలస్థాయి ఇసుక కమిటీలు ఏర్పాటు చేసి, అక్రమ రవాణా అడ్డుకుని అధికారిక వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చుకునేది. ఈ విధానంలో గ్రామ పంచాయతీలకు కూడా ఆదాయం లభించేది. ప్రస్తుతం ప్రభుత్వాధికారులు తమ బాధ్యతలు పక్కన పెట్టి, నెపమంతా ఇతర శాఖలపైకి నెట్టేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. కీలకమైన మండల అధికారిగా తహసిల్దార్ ప్రత్యేక బాధ్యతతో ఇసుక, మట్టి అక్రమ రవాణా అడ్డుకోవాల్సిన అవసరముంది. అసలు క్షేత్ర స్థాయిలో ఈ అక్రమ వ్యవహారాలను నిరోధించాల్సిన గ్రామ పంచాయతీల కార్యదర్శులకు వారి బాధ్యత గుర్తుచేసి ఎంపీడీఓ కూడా సహజవనరుల అక్రమ రవాణా నిరోధించాలి. అధికారిక ర్యాంపుల ద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయం పెంచుకునేందుకు కీలకంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంది. ఈ వ్యవహారమంతా సమన్వయం చేస్తూ జిల్లా మైనింగ్ శాఖాధికారులు కూడా క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తోంది.


——————–
ఇసుక, మట్టి అక్రమ రవాణా నిరోధంపై దృష్టి పెడతా : బూర్గంపాడు తహశీల్దార్ శిరీష
——————–
ఇటీవలే బాధ్యతలు చేపట్టిన తాను మండలంలో ఇసుక, మట్టి అక్రమ రవాణా నిరోధంపై దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటానని బూర్గంపాడు మండల తహశీల్దార్ శిరీష చెప్పారు. మండలంలో జోరుగా సాగిపోతున్న అక్రమాల గురించి “దివిటీ మీడియా” ఆమె దృష్టికి తీసుకెళ్లగా స్పందించారు. ఈ విషయంలో ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని పకడ్బందీగా చర్యలు తీసుకుంటానని తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి ఆటలపోటీలు

Divitimedia

ప్రజలందరూ నిర్భయంగా ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలి

Divitimedia

హైదరాబాదుకు తరలి వెళ్లిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు

Divitimedia

Leave a Comment