Divitimedia
Bhadradri KothagudemHyderabadInternational NewsLife StyleNational NewsPoliticsSpot NewsTelanganaTravel And Tourism

మూడు రోజుల్లో మాడవీధుల స్థల సేకరణ ప్రక్రియ పూర్తి

మూడు రోజుల్లో మాడవీధుల స్థల సేకరణ ప్రక్రియ పూర్తి

శ్రీరామనవమినాడు సీఎం చేతుల మీదుగా పనులకు ప్రారంభోత్సవం

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలి

శ్రీరామనవమి ఏర్పాట్ల సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి

✍️ భద్రాచలం – దివిటీ (మార్చి 23)

భద్రాచలంలో ఏప్రిల్ 6, 7 తేదీల్లో జరిగే శ్రీరామనవమి, మహా పట్టాభిషేకానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం భద్రాచలం ఆర్డీఓ కార్యాలయంలో శ్రీరామనవమి, పట్టాభిషేకం ఉత్సవాల ఏర్పాట్లపై మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీరామనవమికి చేపడుతున్న పనులు, చర్యలను మంత్రికి వివరించారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. ఎండవేడి అధికంగా ఉన్నందున భక్తుల కోసం శ్రీరామనవమి పందిరితోపాటు ఆలయ పరిసర ప్రాంతాల్లో తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు అందించాలని ఆయన ఆదేశించారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు. వైద్యసిబ్బంది, అవసరమైన మందులు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని, అవసరమైతే వేరే జిల్లాల నుంచి అదనపు సిబ్బందిని డెప్యుటేషన్ పై తీసుకోవాలని ఆదేశించారు. వైద్య శాఖలో అనుభవజ్ఞులైన సీపీఆర్ నిపుణులను నియమించాలని మంత్రి ఆదేశించారు. అగ్నిమాపక సిబ్బంది, అవసరమైన ఫైర్ ఇంజన్లు సిద్ధం చేసుకోవాలన్నారు. ఎక్సైజ్ అధికారులు శ్రీరామనవమి ఉత్సవాల సమయంలో మద్యం షాపులు మూసివేయించాలని ఆదేశించారు. ఈసారి శ్రీరామనవమి వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని, దానికి తగినట్లుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీరామనవమి వేడుకలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరవుతారని మంత్రి తెలిపారు. మూడురోజుల్లో మాడ వీధుల విస్తరణకోసం అవసరమైన స్థల సేకరణకు డబ్బు చెల్లించి, శ్రీరామనవమి రోజు సీఎం చేతులమీదుగా మాడవీధుల విస్తరణపనుల ప్రారంభోత్సవకార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ సమీక్షలో ఐటీడీఏపీఓ రాహుల్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ఆర్డీఓ దామోదర్ రావు, అన్నిశాఖల జిల్లా, స్థానిక అధికారులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

లొంగిపోయిన మావోయిస్టు ప్లాటూన్ ఏరియా కమిటీ సభ్యుడు

Divitimedia

జిల్లా పోలీస్ కేంద్రంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

Divitimedia

పడితే ప్రాణాలు పోవడం ఖాయం…

Divitimedia

Leave a Comment