Divitimedia
Bhadradri KothagudemBusinessSpecial ArticlesTelangana

నేడే లిక్కర్ షాపుల కేటాయింపులకు లాటరీ

నేడే లిక్కర్ షాపుల కేటాయింపులకు లాటరీ

అదృష్టం పరీక్షించుకునేందుకు ఆశావహుల ఆరాటం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 88షాపులకు 5,057 దరఖాస్తులు

✍🏽 కామిరెడ్డి నాగిరెడ్డి – దివిటీ మీడియా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్సులు పొందేందుకు అనేక మంది ఆశావహులు ఉవ్విళ్లూరుతున్నారు. ఆదాయం, సామాజిక హోదాల విషయంలో అందరి దృష్టిని ఆకర్షించడంతోపాటు పెట్టిన పెట్టుబడికి రెట్టింపునకు పైగా ఆదాయాన్ని రాబట్టుకునే అవకాశం మద్యం షాపులలో ఉంటుందనే ధీమాతో అనేక మంది మద్యం వ్యాపారంపై దృష్టి సారించారు. ప్రభుత్వం ఎప్పుడు మద్యంషాపులకు టెండర్లు పిలిచే అవకాశం ఉందా? ఎప్పుడెప్పుడు టెండర్లు వేద్దామా అని కాచుకుని కూర్చునేవారనేక మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అది కూడా ఏజెన్సీ ప్రాంతంలో చట్టాల పరిమితి ఉన్నప్పటికీ, చట్టాల్లోని లొసుగుల ఆధారం చేసుకుని బినామీదారులే అత్యధికంగా ఈ మద్యంషాపులు నిర్వహిస్తుంటారు. అసలు ఏజెన్సీప్రాంత చట్టాలు, నిబంధనల అమలు గురించి ఎవరికీ అంతగా పట్టింపు లేకుండా ఈ వ్యవహారం, వ్యాపారం సాగిపోతూనే ఉంటుంది. మద్యంషాపుల టెండర్లు పిలిచే సమయంలో ప్రతిసారి జరిగినట్లుగానే ఈ సారి కూడా కొన్నివివాదాలు తలెత్తినప్పటికీ టెండర్ల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. గత లైసెన్సుల కాలపరిమితి ఇంకా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈసారి చాలా ముందస్తుగానే ఈ మద్యంషాపులకు టెండర్లు పిలిచింది. జిల్లా పరిధిలోని 88 దుకాణాల కేటాయింపులకు సోమవారం లాటరీని నిర్వహించనున్నారు. ఈలాటరీ నిర్వహణకు పాల్వంచ కేటీపీఎస్ కాలనీలోని భద్రాద్రిఆడిటోరియంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆదివారం కలెక్టర్ డాక్టర్ ప్రియాంక స్వయంగా ఈ ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు సూచనలిచ్చారు. కొత్తగూడెం జిల్లా అబ్కారీ కార్యాలయంలో ఆగస్టు 4వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈ జిల్లాలోని 88 మద్యంషాపులకు లైసెన్సులు జారీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ 88మద్యంషాపుల లైసెన్సులు పొందడం కోసం మొత్తం 5057దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. ఈ దఫా కూడా మద్యం షాపులకు లైసెన్సులు పొందేందుకు పెద్దసంఖ్యలోనే దరఖాస్తులు రావడంతో లాటరీ ద్వారా లైసెన్సులు జారీ చేసే ప్రక్రియ ఆగస్టు 21వ తేదీ సోమవారం నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 11గంటల నుంచి గెజిట్ సీరియల్ నెంబర్ వారీగా దుకాణాలకు ‘డ్రా’ తీసే కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక ఈ సందర్భంగా తెలిపారు. ఈ దరఖాస్తులు చేసినవారంతా ఉదయం 9గంటల్లోగా, డ్రా కార్యక్రమం జరిగే భద్రాద్రి ఆడిటోరియానికి చేరుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ డ్రా తీసే విధానంలో చేపట్టాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ ఆబ్కారీ అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో అబ్కారీ డిప్యూటీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, జిల్లా అబ్కారీశాఖ అధికారి జానయ్య, అబ్కారీశాఖ సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఏపీ, తెలంగాణ మధ్య ‘జల జగడం’…

Divitimedia

భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Divitimedia

లొంగిపోయిన మావోయిస్టు బెటాలియన్ దళసభ్యుడు

Divitimedia

Leave a Comment