Divitimedia
Bhadradri KothagudemCrime NewsLife StyleSpot NewsTelanganaYouth

లొంగిపోయిన మావోయిస్టు బెటాలియన్ దళసభ్యుడు

లొంగిపోయిన మావోయిస్టు బెటాలియన్ దళసభ్యుడు

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 19)

చత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ బెటాలియన్ దళసభ్యుడు మడివి అయిత అలియాస్ మంగు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు అధికారులు, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్, ఆర్.ఎఫ్.టి పోలీస్ అధికారుల ఎదుట లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రకటించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ పోలీసుల సంయుక్త కృషితో దళసభ్యుడు లొంగిపోయినట్లు ప్రకటించారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడు పోలీసుస్టేషన్ పరిధిలోని జీలోరుగడ్డ గ్రామానికి చెందిన ఇరవై ఏళ్ల మడివి అయిత అలియాస్ మంగు, 2020 జూన్ లో చత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన హిడ్మా నాయకత్వంలోని ఫస్ట్ బెటాలియన్లో దళసభ్యుడిగా చేరి, ఇప్పటి వరకు అదేదళంలో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. మావోయిస్ట్ పార్టీ బెటాలియన్ నాయకుల ఆదేశాల ప్రకారం ఇతర దళసభ్యులతో కలిసి అతను చత్తీస్ గడ్ రాష్ట్రంలో జరిగిన పలు విధ్వంసకర సంఘటనల్లో పాల్గొన్నాడని పేర్కొన్నారు. ఇటీవల బీజాపూర్ జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేస్తుండటంతో మావోయిస్టు పార్టీని విడిచి, పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోవాలని అతను నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా అనేకమంది మావోయిస్టు పార్టీ నాయకులు, దళ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయి స్వేచ్ఛగా జీవిస్తుండటం పట్ల అతను సంతృప్తిచెంది లొంగిపోయాడని చెప్పారు. లొంగిపోయిన దళసభ్యుడిపై లక్ష రూపాయల రివార్డు ఉందని ఎస్పీ ఈ సందర్భంగా వెల్లడించారు. నిషేధిత మావోయిస్టు పార్టీ నాయకులు, సభ్యులు ఆయుధాలు వీడి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల హక్కుల తరఫున పోరాడాలని కోరారు. పోలీసుల ఎదుట లొంగిపోయి సాధారణ జీవితం గడపాలనుకునేవారు తమ బంధు మిత్రుల ద్వారా గానీ, స్థానిక పోలీసు అధికారుల ద్వారా గానీ, స్వయంగా జిల్లా ఎస్పీ ఎదుట గానీ లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల ప్రతి ఫలాలు అందించి వారికి పునరావాసం కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

దేశంలో వరద పరిస్థితులపై అమిత్ షా సమీక్ష

Divitimedia

ఉగ్రవాదానికి సరైన జవాబిచ్చే హక్కు వినియోగించుకున్న భారత్

Divitimedia

ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించిన అదనపు కలెక్టర్

Divitimedia

Leave a Comment