Divitimedia
Bhadradri KothagudemCrime NewsPoliticsSpot NewsTelangana

పంచమని చెప్తే… వృధాగా పడేశారు…

పంచమని చెప్తే… వృధాగా పడేశారు…

అడవిలో గుట్టగా హరితహారం మొక్కలు

✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు

‘ప్రతి ఏటా జరిగే తంతు ఇదే కదా…?’ అనుకున్నారేమో గానీ అందరికీ పంచిపెట్టి నాటించాల్సిన మొక్కలు అడవిలో గుట్టగా పడేశారు. పారేసిన ఆ మొక్కలను జనానికి పంచిపెట్టినట్లు రికార్డులలో రాసుకున్నారు. పచ్చని మొక్కలు నాటి చెట్లుగా పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్న కోట్ల రూపాయల ప్రజాధనం ఇలా వృధా అవుతోంది. పచ్చగా పెరగాల్సిన మొక్కలు అడవిలో గుట్టలుగా పడేసి ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దంగా కనిపిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ అటవీ ప్రాంతంలో వృధాగా పడేసి ఉన్న వందలాది మొక్కలను ఆదివారం సీపీఎం నాయకులు గుర్తించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బూర్గంపాడు మండలంలో గ్రామ పంచాయతీల పనితీరు, పర్యవేక్షించాల్సిన మండల అధికారుల నిర్లక్ష్యం అడవిలో పడి ఉన్న ఈ మొక్కల రూపంలో వెక్కిరిస్తోంది. బూర్గంపాడు మండల పరిధిలో మొత్తం 17 గ్రామపంచాయతీలుండగా, అడవిలో పడేసి ఉన్న ఈ మొక్కల పాపం ఏ పంచాయతీదో అధికారులే తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ అటవీప్రాంతానికి చుట్టుపక్కలున్న గ్రామ పంచాయతీలలో ఏదో ఒక పంచాయతీకి చెందినవారే ఈ దారుణానికి ఒడిగట్టారనేది సుస్పష్టం. ఫారెస్ట్ అధికారులేమైనా పడేసి ఉంటారా? అంటే ఈ ప్రాంతంలో అడవిలో మొక్కలు ఎక్కడా నాటిన దాఖలాలు లేవు. ఏదిఏమైనా అంత ఖర్చు చేసి, కాస్తోకూస్తో శ్రద్ధ పెట్టి పెంచిన మొక్కలను ఎటాకాకుండా ఈ విధంగా చంపేయడం మాత్రం దారుణం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల ప్రతి ఇంటికి 5 మొక్కలు చొప్పున ఇచ్చి, వాటిని తప్పనిసరిగా నాటించాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఆ మొక్కలను పంచకుండా ఇలా చేశారని తెలుస్తోంది. హరితహారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 26వ తేదీన ప్రభుత్వం అధికారికంగానే ‘కోటి వృక్షార్చన’ పేరుతో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని 948 ప్రదేశాల్లో 4.85 లక్షల మొక్కలు నాటబోతున్నట్లుగా జిల్లా కలెక్టర్ డా.ప్రియాంక ఇటీవల ప్రత్యేక సమావేశంలో ప్రకటించారు. ఆ కార్యక్రమం కోసం ప్రణాళికాబద్ధంగా పనులు చేయాలని కూడా అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇంత ప్రాధాన్యత కలిగిన హరితహారంలో శ్రద్ధతో పనిచేయాల్సిన అధికారులు, సిబ్బంది భారీ సంఖ్యలో మొక్కలను అడవిలో వృధాచేసి పారేయడం పట్ల ప్రజలు ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. ఒక ట్రాక్టర్ లోడుకు పైగా మొక్కలను కృష్ణసాగర్ అడవిలో పడేసిన వారిని గుర్తించి కఠినచర్యలు చేపట్టాలని సామాజికవేత్తలు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

చండ్రుగొండ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ రోహిత్ రాజు

Divitimedia

ఎకరాకు రూ.20లక్షలు, ఒకరికి ఉద్యోగం

Divitimedia

ఆదివాసీల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి

Divitimedia

Leave a Comment