Divitimedia
Bhadradri KothagudemCrime NewsEducationHealthLife StyleSpecial ArticlesTelanganaWELFAREWomenYouth

అంగన్వాడీ ఎంపికల్లో అందినంత దోచుకునే యత్నం

అంగన్వాడీ ఎంపికల్లో అందినంత దోచుకునే యత్నం

అర్హుల వివరాలతో దళారుల బేరసారాలు

అధికారుల పాత్రపై జోరుగా అనుమానాలు

✍️ దివిటీ మీడియా (భద్రాద్రి కొత్తగూడెం)

“బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు”… “చెరువులో నీరు చేరగానే కప్పలు వచ్చి చేరినట్టు”… అంగన్వాడీ పోస్టుల ఎంపిక ప్రక్రియపై కన్నేసిన దళారులు అందినంత దోచుకునే ప్రయత్నాలు ఆరంభించారు… అంగన్వాడీ టీచర్ల పోస్టులలో తక్కువలో తక్కువ రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేసుకోవచ్చనే ఆలోచన దళారులది. అందుకే ‘మెరిట్ అభ్యర్థుల’ వివరాలు తెలుసుకుంటూ, వారిని కాస్త ‘మోటివేట్’ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఒక్కసారి కష్టపడిన సొమ్ము ఎక్కువగా ఖర్చు చేసినా జీవితాంతం ఉద్యోగం చేసుకుంటూ నెలనెలా వస్తున్న జీతంతో, ఇతర ప్రభుత్వ అలవెన్సులతో హాయిగా బతికేయవచ్చని నచ్చజెప్తున్నారు. ఉన్న అభ్యర్థులలో ఎక్కువ మార్కులు వచ్చిన వారిని ఎలాగూ వారికే ఉద్యోగం వస్తుంది కాబట్టి ముందుగానే ‘రేట్’ మాట్లాడుకుని వసూళ్లుచేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఇదో కొత్తతరహా దోపిడీ కావడం ఇక్కడ ప్రస్తావనార్హం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 178 అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీకి గత జూలైలో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ జూలై 18వ తేదీతో ముగిసింది. జులై 20 నుంచి ఈ ఆగస్టు 7 వరకు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్ణయించబడింది. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలని, దరఖాస్తుదారులు తప్పనిసరిగా స్థానిక మహిళ అయి ఉండాలని (గ్రామీణ ప్రాంతాల్లో అయితే అదే పంచాయతీలో, పట్టణాల్లో అయితే అదే వార్డు పరిధిలో) నిర్ణయించారు. ఈ అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ గానీ తత్సమానమైనది ఏదైనా విద్యార్హత కలిగి ఉండాలని ప్రకటించారు. జిల్లాకలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) ద్వారా మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. ఇదంతా సర్వసాధారణమైన ఎంపికల ప్రక్రియగా ఉన్నప్పటికీ ఈ ఉద్యోగాలకు ఎంపికల్లో తాము లాభపడేందుకున్న అవకాశాలను వెతుక్కుంటూ దళారులు వసూళ్లపర్వం ఆరంభించారు. ఈ అక్రమ వ్యవహారంలో జిల్లాలోని ఓ అధికారి కీలకపాత్రధారిగా చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఆమె అభ్యర్థుల ‘మెరిట్ లిస్టులు’ ముందుగానే పరిశీలించి, ఎక్కువ మార్కులతో ఉన్న అభ్యర్థుల వివరాలను తాను ఎంపిక చేసుకున్న మధ్యవర్తులకు అప్పగిస్తూ, వారి సాయంతో జోరుగా బేరసారాలు సాగిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. తమ అధికారే తమను మధ్యవర్తిత్వం కోసం, వసూళ్లకోసం వాడుకుంటున్న ఈ పరిస్థితుల్లో కొందరు ఐసీడీఎస్ సిబ్బంది కీలకంగా మధ్యవర్తిత్వం చేస్తూ వసూళ్లు, బేరసారాలకు దిగినట్లు క్షేత్రస్థాయి నుంచి సమాచారం అందుతోంది. చాలాకాలంగా వేచి చూస్తున్న తరుణంలో అందివచ్చిన మంచి అవకాశం చేజార్చుకోకూడదనేలా అంగన్వాడీల ఎంపికల్లో దళారుల పాత్ర, ప్రమేయం పెరుగుతోంది. అభ్యర్థులకున్న ఆశలే తమ ఆయుధాలుగా మార్చుకుని ‘వసూళ్ల పర్వానికి’ తెగబడుతున్న మధ్య దళారులు, వారికి సహకరిస్తున్న కొందరు ఐసీడీఎస్ అధికారులపై జిల్లా కలెక్టర్, ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాల్సిన అవసరముందని సామాజికవేత్తలు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.
——————————–

సమాచారమిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలతలెనినా
———————————
జిల్లాలో అంగన్వాడీ పోస్టుల ఎంపికల్లో దళారుల ప్రమేయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని, త్వరగా ‘మెరిట్ లిస్టులు’ ఇవ్వాలని మాత్రం సీడీపీఓలకు ఆదేశాలిచంచినట్లు జిల్లా సంక్షేమాధికారి (డీడబ్ల్యుఓ) స్వర్ణలతలెనినా ‘దివిటీ మీడియా’కు వివరణ ఇచ్చారు. దళారులు, సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు సమాచారం ఇస్తే బాధ్యులైన వారిపై తప్పక చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఎన్నికల్లో మతోన్మాద శక్తుల్ని ఓడించాలి : కనకయ్య

Divitimedia

పేద రోగికి నేస్తం ట్రస్ట్ ఆర్థికసాయం

Divitimedia

సంస్కృతి, సంప్రదాయాలు పాటించడంలో గిరిజనులు ఆదర్శం

Divitimedia

Leave a Comment