Divitimedia
Bhadradri KothagudemCrime NewsEducationHyderabadLife StyleSpot NewsTechnologyTelanganaWELFAREWomenYouth

సైబర్ నేరాలపై విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలి

సైబర్ నేరాలపై విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలి

సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

✍️ దివిటీ మీడియా (కొత్తగూడెం)

భావి భారత పౌరులుగా విద్యార్థినులు సైబర్ నేరాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఎస్పీ రోహిత్ రాజు సూచించారు. స్వాతంత్య్ర మాసం సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న “సురక్ష కా తిరంగా–సైబర్ స్వతంత్ర తెలంగాణ” సైబర్ అవగాహన, ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం కొత్తగూడెంలోని సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు సైబర్ భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజు ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థినులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించి సూచనలు చేశారు. ప్రస్తుతం ఎక్కువగా జరుగుతున్న డిజిటల్ అరెస్ట్, స్టాక్, బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్, లోన్ యాప్ మోసాలు, సోషల్ మీడియా మోసాలు, ఏపీకే ఫైళ్ల ద్వారా జరిగే సైబర్ నేరాలు, మ్యూల్ బ్యాంక్ అకౌంట్ల వినియోగం వంటి సైబర్ మోసాల గురించి ఆయన ఉదాహరణలతో సహా విద్యార్థినులకు వివరించారు. తక్కువ సమయంలో అధిక లాభాలు, ఉద్యోగాలు, సినిమాల్లో అవకాశాలు, తక్కువ వడ్డీ రుణాల వంటి ఆకర్షణీయమైన ఆఫర్లు నమ్మి వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు పంచుకోవద్దని సూచించారు. డిజిటల్ లావాదేవీల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వసంస్థల పేరుతో వచ్చే అనుమానాస్పద ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, ఓటీపీలు, కేవైసీ అప్‌డేట్, లోన్స్, రివార్డుల పేరుతో వచ్చే సందేశాలను గుడ్డిగా నమ్మవద్దన్నారు. బ్యాంకుఖాతా వివరాలు, గోప్యమైన సమాచారం ఇతర వ్యక్తులెవరికీ వెల్లడించరాదని తెలిపారు.
సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ కు కాల్ చేసి ఫిర్యాదు నమోదుచేయాలని, సకాలంలో ఫిర్యాదు చేస్తే నష్టపోయిన నగదు తిరిగి పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని ఎస్పీ తెలిపారు. మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, వాటి వినియోగం వ్యక్తిగతజీవితానికే కాకుండా కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సీటు బెల్ట్ ధరించాలని, అతివేగం, నిర్లక్ష్యమైన డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, సైబర్ సెల్ సీఐ జితేందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సైబర్ సెల్ పోలీస్ అధికారులు, కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

చర్ల పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం

Divitimedia

విద్యార్థులు ‘ఎ’, ‘బి’ గ్రేడ్స్ సాధించేలా కృషి చేయాలి

Divitimedia

ఇకనుంచి అందుబాటులో ‘పోలీస్ అక్క’

Divitimedia

Leave a Comment