Divitimedia
Bhadradri KothagudemBusinessCrime NewsLife StylePoliticsSpot NewsTelangana

అధికారం అండతో అడ్డగోలు నిర్మాణాలు…

అధికారం అండతో అడ్డగోలు నిర్మాణాలు…

పలుకుబడి ఉంటే చాలు పట్టుకోలేని పెత్తనం

సారపాకలో వివాదాస్పద భవనంపై మరో వివాదం

✍️ సారపాక, భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (మార్చి 20)

సామాన్యుడు ఇళ్ల కట్టుకోవాలంటేనే సవాలక్ష రూల్స్ పేరు చెప్పే అధికారులు, బడాబాబులను మాత్రం ఏమీచేయలేక చోద్యం చూస్తున్న దుస్థితి ఏర్పడింది. ఓ పేదవాడు తన ఇంటికి మంచినీటిపంపు కనెక్షన్ పొందాలన్నా కూడా కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితులలో అధికారంలో ఉన్నవారి అండతో తమకు నచ్చినట్లుగా చేసుకుంటున్నవారిని అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు… ఇంత దుస్థితికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మేజర్ పంచాయతీ వేదికగా మారింది. అనేక నిబంధనలు అమలులో ఉన్న ఈ ప్రాంతంలో ‘చట్టం ఉన్నవాడి చుట్టం…’ అన్నరీతిలో సాగి పోతున్న అక్రమాలను ఆపే అధికారులే లేకుండా పోయారు. పారిశ్రామికంగా ఓ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న గ్రామం సారపాకలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వ్యక్తులు కొందరు తమకు అధికారులు ఇచ్చిన నోటీసులపై చీమకుట్టినట్లయినా లేకుండా వ్యవహరిస్తున్నారు. సారపాక ముత్యాలమ్మపేట ప్రాంతంలో ఓ వ్యక్తి ఆ గ్రామ పంచాయతీ నుంచి అనుమతిలేక పోయినప్పటికీ ఏకంగా ‘జి+3 భవనం (గ్రౌండ్ ఫ్లోర్+3అంతస్థులు)’ నిర్మించడం విశేషం. అప్పట్లో ఆ వ్యవహారంపై పలు మీడియాల్లో ప్రచురితమైన కథనాలపై స్పందించిన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక అధికారులు సంబంధిత వ్యక్తులకు నోటీసులిచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ ఆ భవన నిర్మాణం మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయిపోయింది. అంటే ఆ నిర్మాణానికి అధికారులు అనుమతులు ఇచ్చి ఉన్నారేమోనని అనుకోవాల్సిన పరిస్థితి. సరే, అదంతా గతంలో జరిగిన వ్యవహారం కదా? అనుకుంటే తాజాగా ఆ భవనం మరోసారి వివాదాస్పదంగా మారింది.
—-‐——————————–
భవనంపై సెల్ టవర్ నిర్మాణం పట్ల మరో వివాదం…
———–‐———–‐————–
తాజాగా ఆ భవనం పైభాగంలో ఓ సెల్ టవర్ నిర్మాణం చేపట్టారు. ఆ నిర్మాణం గురించి స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో వివాదం ముదురుతోంది.
అక్కడ సెల్ టవర్ నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చిన అధికారులెవరనేది అర్థం కాని విషయంగా మారింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేష్ మాత్రం తమ నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని, తాము తాజా నోటీసు కూడా ఇచ్చామని ‘దివిటీ మీడియా’కు తెలిపారు. అసలు గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకోకుండా ఆ టవర్ నిర్మాణం ఎలా ప్రారంభించారనేది అనుమానాస్పదంగా ఉంది. గతంలోనే ఆ భవనం నిర్మిస్తున్నప్పుడే అభ్యంతరం వస్తే నోటీసులు ఇచ్చి ఆ తర్వాత ఏమీ పట్టించుకోకుండా చేతులు దులుపుకున్న
అధికారులు తమనేం చేస్తారులే? అన్న ధీమానే కారణమా? లేకపోతే ఎవరూ ఆ టవర్ విషయం గురించి పట్టించుకోరనే నిర్లక్ష్యమా? అనేది అర్థం కావడం లేదు.
ఈ విషయంలో ఎవరి ధీమా ఎలాగైనా ఉండొచ్చు గానీ అధికారులు మాత్రం గత సంఘటనల లాగానే నోటీసులు ఇచ్చి ఆ తర్వాత ఏమీ పట్టించుకోకుండా వదిలి వేస్తే మాత్రం ప్రజల్లో మరింత చులకనగా కావడం ఖాయం. ఈసారైనా అధికారుల చర్యలు పక్కాగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

దేశంలో వరద పరిస్థితులపై అమిత్ షా సమీక్ష

Divitimedia

ఊరచెరువు అభివృద్ధికి తహసిల్దారును కలిసిన రోటరీబృందం

Divitimedia

రాష్ట్రంలో మరో నాలుగు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం

Divitimedia

Leave a Comment