Divitimedia
Bhadradri KothagudemHealthLife StyleSpot NewsTelanganaWomen

వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : ఐటీడీఏ పీఓ

వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : ఐటీడీఏ పీఓ

అశ్వాపురం పి.హెచ్.సి ఆకస్మిక తనిఖీ చేసిన పీఓ

✍️ అశ్వాపురం – దివిటీ (జులై 2)

వర్షాకాలం ప్రారంభమైనందున ఆదివాసీ గ్రామాలలో వైరల్ జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని, వైద్యారోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండి గిరిజనులకు వైద్య సేవలందించాలని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఆదేశించారు. మంగళవారం అశ్వాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని డ్రగ్స్ స్టోర్, లాబరేటరీ, తదితర విభాగాలు పరిశీలించిన ఆయన ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. వైద్యచికిత్సలు సక్రమంగా అందుకున్నాయా? లేదా? తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ, మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ గిరిజన కుటుంబాలకు సేవలందించేలా వైద్య సిబ్బంది, వైద్యాధికారులు తాము పనిచేసే కేంద్రాల్లో స్థానికంగా నివాసం ఉండాలన్నారు. 24 గంటలూ గిరిజనులకు సేవలు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. వైద్యసిబ్బంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగుల పట్ల, ముఖ్యంగా గర్భిణుల పట్ల మర్యాదపూర్వకంగా ఉంటూ వారికి సరైనవైద్యం అందించాలన్నారు. రోగుల ఓపీ రిజిస్టర్ సక్రమంగా నిర్వహించాలని, గిరిజన గ్రామాల్లో నూతనంగా ప్రబలుతున్న తరుణ, సికిల్ సెల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించాలని కోరారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ఏ రకమైన జ్వరమైనా రక్తపూతలు సేకరించి మలేరియా ఉన్నట్లయితే పూర్తి చికిత్స అందించి మిగతా వ్యాధుల కోసం టీహబ్ కి రక్త నమూనాలు పంపించాలన్నారు. ఆ రిపోర్టులు వచ్చిన తర్వాత పూర్తి చికిత్స అందేవిధంగా గిరిజనులకు సహాయ సహకారాలందించాలన్నారు. తగినన్ని మందులు అన్ని వ్యాధులకు సంబంధించినవి అందుబాటులో ఉంచుకోవాలని ఐటీడీఏ పీఓ డాక్టర్లకు సూచించారు. ఆశావర్కర్లతో మాట్లాడుతూ, వారంతా తమ పరిధిలోని గ్రామాల్లో గిరిజనులకు వర్షాకాలంలో ఇంటిముందు, బయట నీరు నిలువ ఉండకుండా చూసుకునే విధంగా గిరిజనులకు తెలియజేయాలని కోరారు. పాత టైర్లు గానీ కూలర్లు గానీ ఉంటే వాటిని తీసి వేయించాలన్నారు. ఈ సందర్భంగా పీఓ వెటర్నరీ హాస్పిటల్ ను సందర్శించి అక్కడ పనిచేస్తున్న సిబ్బంది సరైన సమాధానం ఇవ్వకపోవడంతో వెటర్నరీ అసిస్టెంట్ అనితకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మణుగూరు లో గొల్లగూడెం గ్రామంలో ఓపెన్ కాస్ట్ విస్తరణకు 800 ఎకరాల భూసేకరణకు సంబంధించి ఎస్.డి.సి సుమ ఆధ్వర్యంలో గ్రామంలోని రైతులతో జరిగిన పీసా గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు, అశ్వాపురం తహసిల్దార్లు రాఘవరెడ్డి, స్వర్ణ, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నాట్యగురువు వరలక్ష్మి కన్నుమూత

Divitimedia

‘బలగం’ సింగర్ మొగిలయ్య మృతి

Divitimedia

గొమ్మూరులో ఘనంగా రంజాన్ వేడుకలు

Divitimedia

Leave a Comment