ఎకరాకు రూ.20లక్షలు, ఒకరికి ఉద్యోగం
ఓసీ విస్తరణ గ్రామసభలో రైతుల డిమాండ్
✍️ మణుగూరు – దివిటీ (జులై 2)
మణుగూరు ఓపెన్ కాస్ట్ విస్తరణ ప్రాజెక్టు కోసం తాము భూములివ్వాలంటే ఎకరాకు రూ.20లక్షల పరిహారం, తమ కుటుంబాల్లో ఒకరికి చొప్పున ఉద్యోగం ఇస్తామని రాతపూర్వకంగా హామీ ఇస్తేనే తమ భూములిస్తామని రైతులు తెలియజేశారు. మణుగూరు ఓపెన్ కాస్ట్(ఓసీ) విస్తరణ ప్రాజెక్టుకు గిరిజన రైతుల భూసేకరణ కోసం మంగళవారం పెసాగ్రామసభ నిర్వహించారు. సింగరేణి అధికారుల సమక్షంలో నిర్వహించిన ఈ గ్రామసభలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, భూ సేకరణ అధికారి సుమ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, మణుగూరు మున్సిపాలిటీ స్పెషలాఫీసర్ బి రాహుల్, సింగరేణి, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, ఆదివాసీ నాయకులు రైతులతో కలిసి పాల్గొన్నారు. గ్రామసభలో భూసేకరణ అధికారి సుమ మాట్లాడుతూ, మణుగూరు ఓపెన్ కాస్ట్ విస్తరణ ప్రాజెక్టు నిర్మాణానికి 800 ఎకరాల భూమి గిరిజనులకు సంబంధించింది సేకరించేందుకు రైతులతో కలిసి చర్చించామన్నారు. ఎకరాకు రూ.20 లక్షలు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని రాతపూర్వకంగా హామీ ఇస్తేనే భూములిస్తామని రైతులు తెలియజేసినందున రైతుల డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని పోయి మరోసారి గ్రామసభ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు తహసిల్దార్ రాఘవరెడ్డి, మున్సిపల్, సింగరేణి అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

