Divitimedia
Bhadradri KothagudemCrime NewsHyderabadLife StyleNational NewsTechnologyTelangana

కొత్తగూడెంలో తగ్గనున్న ట్రాఫిక్ కష్టాలు

కొత్తగూడెంలో తగ్గనున్న ట్రాఫిక్ కష్టాలు

మొర్రేడువాగుపై రెండవ వంతెన నిర్మాణం పూర్తి

ట్రాఫిక్ ట్రయల్స్ ఆరంభం, త్వరలో వంతెనకు ప్రారంభోత్సవం

✍️ కొత్తగూడెం – దివిటీ మీడియా

ప్రతిరోజూ వేలసంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే బ్రిడ్జిపై ఏర్పడిన గోతులతోపాటు, రద్దీ వల్ల ప్రయాణికులు పడుతూ వస్తున్న ఇబ్బందులు అతిత్వరలో తీరనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం పట్టణంలో ఏడేళ్ల క్రితం ప్రారంభించిన ముర్రేడువాగు రెండో బ్రిడ్జి పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఆపసోపాలు పడుతూ వచ్చిన కాంట్రాక్టర్లు, జాతీయ రహదారుల విభాగం అధికారుల నిర్లక్ష్యంతో ఈ బ్రిడ్జి పనులు ఆలస్యమైనప్పటికీ ఇప్పుడు పూర్తయ్యాయి. ఈ పనుల్లో జాప్యం కారణంగా ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదనే విషయాన్ని ప్రస్తావిస్తూ “దివిటీ మీడియా” కథనాలు ప్రచురించింది. విజయవాడ- భద్రాచలం- కుంట జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కొత్తగూడెం సమీపంలోని రామవరం నుంచి భద్రాచలం వరకు దాదాపు రూ.187కోట్ల పైగా అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. ఈ పనుల్లో భాగంగానే కొత్తగూడెం పట్టణంలో ముర్రేడు వాగుపై రెండో వంతెన నిర్మాణం చేపట్టారు. ప్రారంభించి ఏడేళ్లు దాటినా, నత్తనడకన సాగిన పనుల తీరుపై పలువురు సామాజికవేత్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఈ బ్రిడ్జి పనులు త్వరితగతిన పూర్తి చేయాలంటూ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలతోపాటు పలు సందర్భాల్లో అధికారులను నిలదీశారు. వంతెనలో ప్రధాన భాగం, రెండువైపులా ఉన్న అప్రోచ్ పనులలలో తీవ్రమైన ఆలస్యం జరుగుతున్న అంశాన్ని ఆయన సందర్భానుసారం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రెండవ వంతెన పనులు పూర్తి కాకపోవడం, పాత బ్రిడ్జిమీద తరచుగా ఏర్పడుతున్ప గోతులను సక్రమంగా పూడ్చి మరమ్మతులు చేయకపోతుండటంతో కొత్తగూడెం ముర్రేడువాగు వంతెనపైనుంచి ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,ఛత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు సాగుతున్న ఈ జాతీయరహదారి మీద ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితుల్లో నిత్యం వేలాది వాహనాలు ఈ పాత బ్రిడ్జిపైనుంచే వెళ్తుంటాయి. ఈ వాహనాలకు తోడు పట్టణంలో స్థానికంగా ప్రయాణాలు చేసే వాహనాలు కూడా పెద్దసంఖ్యలో ఈ బ్రిడ్జి పైనుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. పట్టణంలోనుంచి నవభారత్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ‘ప్రభుత్వ జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)’కు నిత్యం వేలమంది ఉద్యోగులు, పట్టణవాసులు, ఇతర ప్రాంతాల ప్రజలు ఈ బ్రిడ్జిపైనుంచే రాకపోకలు సాగిస్తుంటారు. ఆరేళ్ల క్రితం నాటితో పోల్చితే వాహనాల సంఖ్య, రాకపోకలు దాదాపు రెట్టింపయ్యాయి. సగం సామర్థ్యం మాత్రమే ఉన్న పాత వంతెన పైనుంచి పెద్దసంఖ్యలో రాకపోకలు సాగుతుండటం, అందులోనూ వాహనాలు ఎదురెదురుగా రాకపోకలు సాగిస్తుండటంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికితోడు ఇదే పాత బ్రిడ్జిపై అడుగడుగునా తరచూ గోతులేర్పడుతున్న దుస్థితిలో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రెండవ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయి, త్వరలో ప్రారంభోత్సవం జరుగనుండటంతో ప్రజల ప్రయాణకష్టాలు కాస్తయినా తగ్గబోతున్నాయి.


Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సరూర్ నగర్ హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు

Divitimedia

హైకోర్టు జడ్జిని కలిసిన భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్

Divitimedia

పట్టుబడిన రూ.1.87 కోట్ల విలువ చేసే గంజాయి దహనం

Divitimedia

Leave a Comment