Divitimedia
Bhadradri KothagudemEducationHealthHyderabadKhammamLife StyleSpecial ArticlesTelanganaYouth

ఐటీడీఏ పరిధిలో గాడి తప్పుతున్న విద్యా వ్యవస్థ

ఐటీడీఏ పరిధిలో గాడి తప్పుతున్న విద్యావ్యవస్థ

అంతర్గత కుమ్ములాటలపై ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ ఆగ్రహం

✍🏽 కె.ఎన్.ఆర్ – దివిటీ మీడియా

ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ పర్యవేక్షణలో నడుస్తున్న ఆశ్రమ పాఠశాలల్లో పరిస్థితులు ఘోరంగా దిగజారుతున్నాయి. అన్నిరకాల వసతులు, అత్యాధునికపరికరాలు, సామగ్రి తదితరాలతో పూర్తి స్థాయి అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నారు. అయినప్పటికీ ఫలితాలు మాత్రం ఆశించినస్థాయిలో లేక పోవడం పట్ల ఉన్నతాధికారులే ఆగ్రహంగా ఉన్నారు. పాఠశాలల్లో ఉన్న దుస్థితి వారిని కూడా కలవరపాటుకు గురిచేస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఐటీడీఏ పర్యవేక్షణలో గిరిజన సంక్షేమశాఖ తరపున నిర్వహించబడుతున్న ఆశ్రమపాఠశాలల్లోని అస్తవ్యస్తపరిస్థితులు భయపెడుతున్నాయి.

గిరిజనసంక్షేమశాఖ పర్యవేక్షణలో ఉన్న 46 ఆశ్రమపాఠశాలలు, 4ఆశ్రమ ప్రాథమికోన్నత పాఠశాలలు, హాస్టళ్లల్లో మొత్తం 17,019 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో కీలకమైన ఈ విద్యా వ్యవస్థలో ప్రస్తుతం అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పలు ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఆధిపత్యపోరుతో ఈ పరిస్థితులకు కారణం అవుతున్నారు. విద్యార్థులకు ఆహారంతో పాటు పలురకాల ‘ప్రొవిజన్స్’ అందించాల్సి ఉండగా, అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు జోరుగా వస్తున్నాయి. ఎవరికి వారు తామే పెత్తనం చేయాలనే ఆధిపత్య ధోరణులతో తమలో తాము కీచులాటలతో కాలం గడిపేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పలు ఆశ్రమ పాఠశాలల్లో విద్యాబోధన, క్రమశిక్షణ మూలనపడినట్లు తెలుస్తోంది. అధికారుల పర్యవేక్షణలోపం కూడా దీనికి కారణమని అర్థమవుతోంది. ఈ ఆశ్రమ పాఠశాలలను పర్యవేక్షించాల్సిన సీఆర్పీలు, ఏటీడబ్ల్యుఓ స్థాయి అధికారులు కూడా ఈ అక్రమాలలో వాటాదారులుగా మారుతుండటం వల్లనే, అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అందించాల్సిన అల్పాహారం, భోజనం, స్నాక్స్ విషయంలో అక్రమాలకు పాల్పడుతున్న ఓ పెద్ద ఆశ్రమ పాఠశాలలో ‘డిప్యూటీ వార్డెన్’ పోస్ట్ నిర్వహణకు పోటీ ఏర్పడి తీవ్రమైన వివాదానికి దారితీసింది. ఆ ‘సెటిల్ మెంట్’ను అడ్డంపెట్టుకుని సీఆర్పీ ఒకరు వారం వారం విద్యార్థుల కోడిగుడ్లు
కూడా వదిలిపెట్టకుండా ఇంటికి పట్టుకెళ్తూ బయట అమ్ముకునే దుస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. దీనిని బట్టి అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయనే విషయం అర్ధం చేసుకోవచ్చు. విద్యార్థి సంఘాలు, ఇతర సంస్థలతో ఇబ్బందులు ఏర్పడకుండా గతంలో పనిచేసిన ఐటీడీఏ పీఓ తీసుకున్న చర్యలు ప్రస్తుతం ప్రిన్సిపాళ్లు, వార్డెన్లకు ఏ భయమూ లేకుండా వరంగా మారినట్లుగా తెలుస్తోంది. కొందరు ఉపాధ్యాయులు ఈ బాధ్యతలు తీసుకుని, కేవలం అక్రమాలపై మాత్రమే దృష్టి కేంద్రీకరించడం మూలంగా ఆధిపత్య పోరు ఏర్పడుతోంది.

భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి(పీఓ)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ప్రతీక్ జైన్, ముఖ్యంగా విద్యావ్యవస్థపై దృష్టి సారించి సంస్కరించే పని చేపట్టారు. ఎప్పటికప్పుడు సమీక్షలు, తనిఖీలతో పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం సమీక్ష నిర్వహించిన ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్, ముఖ్యంగా పాల్వంచ, గొందిగూడెం, రామచంద్రునిపేట ఆశ్రమపాఠశాలల్లో విద్య విషయాలను పరిశీలించి విద్యార్థులందరూ చాలా వెనుకబడి ఉన్నట్టుగా గుర్తించారు. గతేడాది ఎస్.ఎస్.సి ఫలితాలు కూడా ఈ మూడు పాఠశాలల్లో తక్కువగా వచ్చినట్లు గమనించారు. ముఖ్యంగా గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులలో విద్యార్థులు ఎక్కువగా ఫెయిల్ అయిన విషయం గుర్తించారు. గత నెలలో నిర్వహించిన ఎస్.ఎ-1 ఫలితాలలో కూడా ఎక్కువమంది ‘డి, ఇ గ్రేడ్స్’లో ఉన్న అంశాన్ని కూడా గుర్తించారు. ఈ మూడు పాఠశాలల ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్, ఆ ఉపాధ్యాయుల మధ్య అంతర్గత కుమ్ములాటలతో విద్యాబోధన సక్రమంగా జరగడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్దులకు మంచి విద్యనందించే విషయంలో నిర్లక్ష్యం కొనసాగిస్తే ఆ మూడు పాఠశాలల్లో ఉపాధ్యాయులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధ్యాయులందరూ బోధనపైనే దృష్టి పెట్టాలని, యూనియన్ పరంగాగానీ, ఇతర రాజకీయాలు చేయకూడదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. పాఠశాలల్లో ఐక్యత దెబ్బ తీసే విధంగా ప్రవర్తిస్తే ఆ ఉపాధ్యాయులను ఉపేక్షించకుండా, పనిష్మెంట్ కింద అవసరం అయితే మారుమూల ప్రాంతాలకు కూడా పంపిస్తామన్నారు. ఉపాధ్యాయులు తమ తమ పద్దతి మార్చుకొని గిరిజన విద్యార్దుల కు మంచి విద్యనందించాలని పీఓ హితవు పలికారు. తాజాగా ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ చేసిన హెచ్చరికలతోనైనా గిరిజన సంక్షేమ శాఖ విద్యావ్యవస్థ మెరుగుపడుతుందేమో చూడాలి మరి…

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ముంపు బాధిత గ్రామాలను కాపాడాలని ధర్నా

Divitimedia

18న హైదరాబాదులో ఇండియా – మలేషియా ఫుట్ బాల్ మ్యాచ్

Divitimedia

స్వయంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన ఏఎస్పీ పరితోష్ పంకజ్

Divitimedia

Leave a Comment