Divitimedia
PoliticsSpecial Articles

‘బీఆర్ఎస్’ కు కొత్త అర్థం చెప్పిన రాహుల్ గాంధీ…

ఖమ్మం జనగర్జన సభ ద్వారా తెలంగాణలో రాబోయే ఎన్నికల కోసం కీలకమైన ఓ హామీ ప్రకటించిన రాహుల్ గాంధీ, ప్రత్యర్థి పార్టీల తీరును ఎండగట్టేలా ఘాటైన వ్యాఖ్యలతో కేడర్ లో ఊపుతెచ్చారు. ‘బీఆర్ఎస్’ అంటే ‘బీజేపీ రిస్తేదార్ సమితి’ అంటూ వ్యాఖ్యలు చేసిన రాహుల్, బీఆర్ఎస్ పార్టీకి కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యామ్నాయం అనే విషయాన్ని సూటిగా జనంలోకి తీసుకువెళ్లి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మలచుకునేలా ప్రయత్నం చేశారు. గతంలో వరంగల్ సభలో ‘రైతు డిక్లరేషన్’ పేరుతో రైతులకు హామీ ఇవ్వగా, ఆ తర్వాత ‘యూత్ డిక్లరేషన్’ ప్రకటించిన తీరులోనే తాజాగా ఖమ్మం సభలో మరొక ఎన్నికల వాగ్దానం ప్రకటించారు. వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.4వేలు ఇచ్చేలా హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ ఈ హామీని ప్రకటించిన సమయంలో సభాప్రాంగణంలో పెద్దపెట్టున జయజయధ్వానాలు చేయడం గమనార్హం. అంటే ఈ పెన్షన్ హామీ సభలో అందరినీ బాగా ఆకట్టుకుందని అర్థమైంది.
గిరిజనులకు పోడు భూములపై హక్కులు కల్పిస్తామని కూడా రాహుల్ ప్రకటించారు.
డిసెంబరు 9న తెలంగాణ ప్రకటన వచ్చిన విషయం గుర్తు చేసిన పీసీసీ ఛీఫ్ రేవంత్‌ రెడ్డి, అదే డిసెంబరు 9న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని ప్రకటించి ఆకట్టుకున్నారు. తెలంగాణ కోసం 1200 మంది బలిదానాలు చేస్తే, ఆ బలిదానాలకు చలించిపోయిన సోనియాగాంధీ, 60 ఏళ్ల పోరాటాన్ని గుర్తించి తెలంగాణ ఇచ్చారని చెప్పడం ద్వారా తెలంగాణ ఆవిర్భావానికి కాంగ్రెస్ అధినాయకత్వం చొరవే కారణమనే విషయం ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేలా ప్రయత్నించారు. కల్వకుంట్ల కుటుంబం ఈ తెలంగాణను కొల్లగొట్టిందని, అందుకే వారి కుటుంబాన్ని కుటుంబాన్ని అండమాన్ వరకు తరమాలంటూ, వారిపై వ్యతిరేకత మరింత పెరిగేలా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ కారణంగానే కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో కూడా కర్ణాటక ఎన్నికల ఫలితాలే వస్తాయని ప్రకటించడం ద్వారా రాహుల్‌ గాంధీ, ఆయన టీమ్ సానుకూలతను కాస్త పెంచుకునే ప్రయత్నం చేశారు. కేసీఆర్ చేసే కుంభకోణాలన్నీ ప్రధాని మోదీకి తెలుసని,
బీజేపీకి బీ టీముగా పనిచేస్తున్నారని, సీఎం కేసీఆర్ చెయ్యి ప్రధాని నరేంద్రమోదీ చేతిలో ఉందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ సహా రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరూ రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్తూ సానుకూలత పెంచుకునే ప్రయత్నం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇతర ప్రాంతాల్లో కూడా తనకంటూ సొంత ఇమేజ్ ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తన అనుచరులతో సహా కాంగ్రెస్ పార్టీలో చేరిక, రాష్ట్రంలో పెరుగుతున్న సానుకూలత వంటి కారణాలతో ఖమ్మం గుమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభ ఆ పార్టీ కేడర్ లో నూతనోత్సాహం తెచ్చి పెట్టింది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అధికారులకు ‘కత్తి మీద సాము’ లా మారుతున్న ఎంపికలు

Divitimedia

ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ లను విజిట్ చేసిన ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా

Divitimedia

జిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

Divitimedia

Leave a Comment