Divitimedia
Bhadradri KothagudemEducationHealthLife StyleSpot NewsTelanganaWELFAREWomenYouth

పాల్వంచ మండలంలో జిల్లాకలెక్టర్ ఆకస్మికతనిఖీలు

పాల్వంచ మండలంలో జిల్లాకలెక్టర్ ఆకస్మికతనిఖీలు

క్రీడలతోపాటు విద్యలోనూ రాణించేలా తీర్చిదిద్దాలని ఆదేశాలు

✍️ దివిటీ మీడియా (కొత్తగూడెం)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ మండలం కిన్నెరసాని, యానంబైలు, రాజాపురం ప్రాంతాల్లోని పాఠశాలలు, పల్లెదవాఖాన, అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీచేశారు. కిన్నెరసాని గిరిజన సంక్షేమ ఆదర్శ క్రీడా పాఠశాల, యానంబైలు జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల, యానంబైలు పల్లె దవాఖాన, రాజాపురం అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి విద్యార్థులు, చిన్నారులు, గ్రామీణ ప్రజలకు అందుతున్న విద్య, క్రీడాశిక్షణ, వసతి, భోజన, వైద్యసేవలు, పౌష్టికాహారం, పారిశుద్ధ్యం తదితర పలు సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. సంబంధిత సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకోవడంతోపాటు సేవల తీరును స్వయంగా పరిశీలించారు. కిన్నెరసానిలో గిరిజనసంక్షేమశాఖ నిర్వహిస్తున్న ఆదర్శ క్రీడాపాఠశాలను జిల్లాకలెక్టర్ ఆకస్మికంగా తనిఖీచేశారు. తరగతి గదులు, వసతి గృహాలు, వంటశాల, లైబ్రరీ, క్రీడా ప్రదేశాలు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, భవనాలస్థితి, తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం తదితర అంశాలను ఆయన పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్, వసతిగృహంలో ఏమైనా సమస్యలున్నాయా? అక్కడ అందుతున్న సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో స్నేహ పూర్వకంగా మాట్లాడిన కలెక్టర్, విద్యా ప్రగతిపై ఆరాతీశారు. యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, ఇతర విద్యాసామగ్రి, తరగతుల్లో బోధన జరుగుతున్న తీరు, బోధనపై ఉపాధ్యాయులు శ్రద్ధ, తదితర వివరాలడిగి తెలుసుకున్నారు.వంటశాల పరిశీలించి, ఆహారం నాణ్యత, తయారీ విధానం, వంటశాల పరిశుభ్రత, మెనూ అమలు, తదితర అంశాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. క్రీడా పాఠశాలలో విద్యార్థులకందిస్తున్న క్రీడా శిక్షణపై జిల్లాకలెక్టర్ ఆరాతీశారు. క్రీడల్లో శిక్షణ తీరు, విద్యార్థుల ప్రతిభ, పాల్గొన్న పోటీల వివరాలు తెలుసుకున్నారు. క్రీడా సామగ్రి పరిస్థితులపై ఆరాతీసిన కలెక్టర్,
ఉపాధ్యాయులకు సూచనలు చేశారు.
యానంబైలులో జిల్లాపరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, మధ్యాహ్నభోజనం తీరు తెలుసుకున్నారు. భోజననాణ్యత, రుచి, మెనూ అమలు వివరాలు సేకరించారు. మధ్యాహ్నభోజనం మెనూ ప్రకారం లేక పోవడంపై అసంతృప్తి వ్యక్తంచేసిన జిల్లా కలెక్టర్, విద్యార్థులకు నిర్దేశించిన మెనూ ప్రకారం ప్రతిరోజూ నాణ్యమైన, రుచితో కూడిన ఆహారం అందించాల్సిందేనని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఆహారనాణ్యత, మెనూ అమల్లో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై కఠినచర్యలు తప్పక తీసుకుంటామని హెచ్చరించారు. భోజన పథకం అమలు తీరును సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఉపాధ్యాయులకు, విద్యా శాఖాధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా యానంబైలు గ్రామంలో పల్లె దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, ప్రజలకు అందుతున్న ప్రాథమిక వైద్యసేవలు, రోగులకు సదుపాయాలు, సిబ్బంది పనితీరు తదితర అంశాలను పరిశీలించారు. రక్త పరీక్షల నమూనాల వివరాలనడిగి తెలుసుకుని, అక్కడున్న ఔషధ నిల్వలను పరిశీలించిన కలెక్టర్ మందుల లభ్యత, పంపిణీ వివరాలతో పాటు మందుల గడువుతేదీలను తనిఖీ చేశారు. గడువు ముగిసిన మందులను వినియోగించకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రోగులకు అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఆ వివరాలన్నీ రిజిస్టర్లలో ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామీణప్రాంతాల ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక వైద్యసేవలు సకాలంలో అందే విధంగా సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పల్లె దవాఖానకు వచ్చే ప్రతిరోగికి వైద్య సేవలతోపాటు ఆరోగ్యపరిరక్షణ గురించి వ్యాధుల నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పల్లె దవాఖాన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి ప్రజలకనుకూలమైన వాతావరణంలో వైద్యసేవలందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్, కిన్నెరసాని గ్రామ పంచాయతీ పరిధిలోని రాజాపురం అంగన్వాడీకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో అంగన్వాడీ కేంద్రంలో నిద్రిస్తున్న చిన్నారులను చూసి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అక్కడ అందుతున్న సదుపాయాలు, పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం, విద్య తీరుపై అంగన్వాడీ టీచరును వివరాలడిగి తెలుసుకున్నారు. చిన్నారుల హాజరు, వారికందిస్తున్న ఆహారం, పౌష్టికాహారం పంపిణీ, గుడ్లు తదితర వివరాలపై ఆరా తీశారు. చిన్నారులకు వడ్డించేందుకు సిద్ధంచేసిన ఆహారం పరిశీలించారు. ఆ ఆహారం నాణ్యత, తయారీ విధానం, వంటశాల పరిశుభ్రత తదితరాంశాలను పరిశీలించి చిన్నారులకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన పౌష్టికాహారం అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అంగన్వాడీ కేంద్రంలో పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం ఎల్లప్పుడూ కొనసాగించాలని సూచించారు. పిల్లల ఆరోగ్యం, పోషణ, భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి, ఎదుగుదల, ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ ఆకస్మిక తనిఖీలలో తహసీల్దార్లు ధారా ప్రసాద్, ప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ప్రత్యేక ఓటరు సవరణ క్యాంపులు పకడ్బందీగా నిర్వహించాలి

Divitimedia

హాస్టల్లో అపరిశుభ్రత, అసౌకర్యాలపై కలెక్టర్ ఆగ్రహం

Divitimedia

సారపాకలో చంద్రబాబు జన్మదిన వేడుకలు

Divitimedia

Leave a Comment