Divitimedia
Bhadradri KothagudemHyderabadKhammamLife StyleSpecial ArticlesSpot NewsTelanganaYouth

ఆదర్శం… ఆ అధికారి వ్యక్తిత్వం

ఆదర్శం… ఆ అధికారి వ్యక్తిత్వం

నిరాడంబరంగా రవీంద్రనాథ్ ఉద్యోగ విరమణ

✍️ దివిటీ మీడియా (కొత్తగూడెం)

అట్టడుగు స్థాయిలో అటెండర్ ఉద్యోగం చేసేవారు కూడా ఆడంబరంగా ఉద్యోగ విరమణ చేస్తున్న ఈ రోజుల్లో ఉన్నత స్థాయిలో ఉండి కూడా ఆయన ఉద్యోగ విరమణ చేసిన తీరు ఆదర్శవంతంగా ప్రశంసలందుకుంటోంది. ఓ జిల్లాస్థాయి అధికారిగా మల్లాది వెంకటరవీంద్రనాథ్, తన ఉద్యోగ ప్రస్థానం అతి సాధారణంగా ముగించిన తీరు పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జులై 31న ‘స్పెషల్ డిప్యూటీ కలెక్టర్’గా ఉద్యోగ విరమణ చేసిన ఆయన ఓ సాధారణ వ్యక్తిలాగా తన కార్యాలయం నుంచి సాయంత్రం పూట బయటకు వచ్చి ప్రతిరోజులాగే బస్సులో ఇంటికి వెళ్లిపోయారు. ఆయన ఉద్యోగ విరమణచేస్తున్న విషయం తెలుసుకున్న తోటి అధికారులు, ఉద్యోగులతోపాటు కొందరు అభిమానులు కార్యాలయానికి వచ్చి కరచాలనంతో అభినందించడం మినహా మరెలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఉద్యోగ విరమణ సందర్భం ముగిసింది. ఆయనను అభినందించడం కోసం శాలువాలతో వచ్చినవారిని కూడా వారించిన రవీంద్రనాథ్, ఆ శాలువాలను కూడా తిరస్కరించారు. వచ్చిన వారికి కనీసం ‘టీ’, స్వీట్స్ వంటివి లేకపోవడం చూస్తే ఆయన తన ఉద్యోగ విరమణను ఎంత సాధారణ అంశంగా చూశారనేది అర్థం చేసుకోవచ్చు. రెవెన్యూ సంఘం నాయకులే కాకుండా తన కార్యాలయం ఉద్యోగులు ఏర్పాటు చేయాలనుకున్న చిరు సన్మానకార్యక్రమం కూడా ఆయన తిరస్కరించడం విశేషం. తన ఉద్యోగ విరమణ రోజు జిల్లా కలెక్టర్ అంకిత్ అందుబాటులో లేకపోవడంతో ఆయన మరుసటి రోజైన శనివారం వెళ్లి కలెక్టర్ ను కలిశారు. జిల్లాకలెక్టర్ శాలువా కప్పి ఓ ఙ్ఞాపిక బహూకరించి సత్కరించడం ద్వారా రవీంద్రనాధ్ ఉద్యోగ విరమణ కార్యక్రమం పూర్తయింది. జిల్లాకలెక్టర్ అంకిత్ అభినందనలు తెలిపి, ఆయన నిరాడంబరతను ప్రశంసించారు…

భద్రాచలం పట్టణానికి చెందిన మల్లాది వెంకటరవీంద్రనాథ్ ఎమ్మెస్సీ (అగ్రికల్చర్) విద్యార్హతతో 1995 బ్యాచ్‌లో డిప్యూటీ తహసీల్దార్‌గా తన ఉద్యోగ ప్రయాణాన్ని ప్రారంభించి, 2026 జులై 31న సెలెక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో పదవీ విరమణ చేశారు. ఆయన తహసిల్దార్ గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ మండలాలతో పాటు ఇతర జిల్లాలలో కూడా పలుచోట్ల పనిచేశారు. ఆర్డీఓగా ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచలలో పని చేసిన ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్ఓ) కూడా పని చేశారు. రెవెన్యూ శాఖలో కేవలం విధి నిర్వహణకే పరిమితంకాకుండా నిబద్ధత నిజాయితీ, క్రమశిక్షణ, ప్రజాసేవ పట్ల అంకితభావం, సహోద్యోగుల పట్ల స్నేహ పూర్వక వైఖరి వంటి ఉన్నత విలువలు పాటించారని ఆయన అభిమానులు ఈ సందర్భంగా ప్రశంసిస్తున్నారు. ఆయన తన సుదీర్ఘ సేవాకాలంలో అనేక మంది ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తిగా అభినందిస్తున్నారు. పరిపాలన పరంగా సమర్థవంతంగా పలు దృఢమైన నిర్ణయాలలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం మానవీయదృక్పథంతో ముందుకు సాగారని చెప్తున్నారు. రవీంద్రనాధ్ సేవా ప్రస్థానం రెవెన్యూ శాఖ సహోద్యోగులు, ఇతర అధికారులందరికీ ఆదర్శవంతంగా మారాలని ఆయన అభిమానులు ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పాల్వంచ ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు భేష్

Divitimedia

Divitimedia

విజయదశమి ఉత్సవాల్లో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయశోభ

Divitimedia

Leave a Comment