భారీ పెట్టుబడి మోసం కేసు ఛేదించిన పోలీసులు
నిందితుడి అరెస్టు.. నేరార్జితంగా గుర్తించిన 35 వాహనాలు స్వాధీనం


✍️ దివిటీ మీడియా (కొత్తగూడెం)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌లో(క్రైమ్ నెం.134/2026) నమోదైన కేసులో ప్రధాన నిందితుడిగా బేతంపూడి భరత్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు శనివారం కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు. ఆ వివరాలు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ కేసులో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలమేరకు ఆ నిందితుని నుంచి నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 35వాహనాలతోపాటు, ఇతర చరాస్తులను స్వాధీనం చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. భార్పాటీ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఆ నిందితుని భారీమోసం బయటపడిందని వివరించారు. తాను భద్రాచలం ఐటీసీ పేపర్ బోర్డ్స్ సంస్థలో లేబర్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నానని, తనతో భాగస్వామి గా మారితే కాంట్రాక్ట్ పనులు ఇప్పించి అధిక లాభాలు అందిస్తానని నమ్మబలికి భరత్ కుమార్ పలువురిని మోసం చేసి నట్లు తెలిపారు. ఆ బాధితుల నుంచి దాదాపు రూ.52 కోట్ల మేర పెట్టుబడుల పేరుతో నిందితుడు మోసపూరితంగా డబ్బులు సేకరించినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. బాధితులు విశ్వసించే విధంగా నకిలీ భాగస్వామ్యఒప్పందాలు, తప్పుడు పత్రాలు రూపొందించి, తనకు వచ్చే లాభాలు లాభాల్లో 4 శాతం వాటా ఇస్తామని హామీలిచ్చి మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని తెలిపారు. బీకే నాయుడు అండ్ కో, రాజేశ్వరి ట్రావెల్స్ పేర్లతో సంస్థలను నిర్వహిస్తూ ఈ మోసపూరిత కార్యకలాపాలు సాగించినట్లు గుర్తించామని డీఎస్పీ వెల్లడించారు.
సాంకేతిక ఆధారాలు, ఆర్థిక లావాదేవీల విశ్లేషణ ఆధారంగా నిందితుడిని కేరళ రాష్ట్రంలోని పాలా ప్రాంతంలో అరెస్టు చేసి, ట్రాన్సిట్ వారెంట్‌పై జిల్లాకు తీసుకు వచ్చి పోలీసు కస్టడీలో విచారించినట్లు తెలిపారు. విచారణలో భాగంగా అతని వద్ద నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 6 బస్సులు, ఒక వాటర్ ట్యాంకర్ లారీ, 3 ట్రాక్టర్లు, 2 వ్యవసాయ పరికరాలు, 7 కార్లు, 14 ద్విచక్ర వాహనాలు, 2 ట్రైలర్లు కలిపి మొత్తం 35 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. బాధితుల నుంచి మోసపూరితంగా సేకరించిన డబ్బుతో భద్రాచలంలోని రాజీవ్‌నగర్ కాలనీలో ఒక మూడంతస్తుల భవనం, ఒక ప్లాట్ కొనుగోలు చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, సంబంధిత పత్రాల పరిశీలన కొనసాగుతోందని తెలిపారు. మిగిలిన బాధితులను గుర్తించడం, నేరార్జిత ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకోవడం, పూర్తి మనీట్రైల్‌ను వెలికి తీసే దిశగా దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ ఆదినారాయణ వివరించారు.
అధిక లాభాలొస్తాయంటూ, తక్కువ సమయంలో పెట్టుబడికి రెట్టింపు, భారీ రాబడులు వస్తాయని చెప్పే వ్యక్తులు, సంస్థలను గుడ్డిగా నమ్మి డబ్బులు పెట్టవద్దని ప్రజలకు సూచించారు. ఆకర్షణీయమైన హామీలు, నకిలీ పత్రాలు, తప్పుడు ఒప్పందాలతో మోసగాళ్లు ప్రజలను మభ్యపెడుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనుమానాస్పద పెట్టుబడి పథకాలపై సమాచారం తెలిసినా, మోసానికి గురైనా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజల అప్రమత్తతతోనే ఇటువంటి ఆర్థిక నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కృషిచేసిన లక్ష్మీదేవిపల్లి పోలీసు సిబ్బందిని, జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

