ప్రజావాణిలో అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్


✍️ దివిటీ మీడియా (ఖమ్మం)
ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ప్రజల అర్జీలు స్వీకరించారు. సమస్యలు తెలుపుతూ ప్రజలు సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు.
రఘునాథపాలెం మండలం వి. వెంకటాయపాలెం గ్రామానికి చెందిన కే. సక్కుబాయమ్మ గ్రామ సర్వే నెంబర్ 257/ఎఏ లో ఉన్న 5 ఎకరాల 26 గంటలకు జారీ చేసిన నాలా అనుమతిని రద్దుచేసి ఈ పాస్ పట్టాదార్ పాస్ పుస్తకం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం గ్రామ పాలకవర్గ సభ్యులు తమ గ్రామ రోడ్డువిస్తరణలో తొలగిస్తున్న అంబేద్కర్ విగ్రహం గ్రామపంచాయతీ కార్యాలయం ప్రక్కనే ప్రభుత్వ స్థలంలో సురక్షితంగా మార్చేందుకు తగుచర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు ఇచ్చారు. తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ఖమ్మం రూరల్ ఎంపీడీఓకు అదనపు కలెక్టర్ ఆదేశాలిచ్చారు.
పి.డి.ఎస్.యు ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు జిల్లావ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని, విద్యార్థులకవసరమైన పరుపులు, బెడ్లు అందించాలని కోరుతూ దరఖాస్తు ఇచ్చారు. దీనిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ప్రజావాణిలో డీఆర్ఓ సీహెచ్.రామ్మూర్తి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

