Divitimedia
Bhadradri KothagudemHealthLife StyleSpot NewsTelanganaWELFARE

వయోవృద్ధుల సంక్షేమానికి ప్రాధాన్యం

వయోవృద్ధుల సంక్షేమానికి ప్రాధాన్యం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్

✍️ దివిటీ – భద్రాద్రి కొత్తగూడెం (నవంబరు 19)

వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా పరిపాలనా యంత్రాంగం కట్టుబడి ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ తెలిపారు. ప్రస్తుత రోజుల్లో కుటుంబాలు వయోవృద్ధులను నిర్లక్ష్యం చేసే పరిస్థితులు పెరిగిపోతున్నాయని, ఒంటరితనం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల వంటి అంశాలు వృద్ధులను బాధిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలతలెనినా ఆధ్వర్యంలో ఐడీఓసీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జిల్లాకలెక్టర్ మాట్లాడుతూ, వృద్ధులకు చట్టప్రకారం పోషణ భృతి అందించేలా జిల్లా సంక్షేమశాఖ, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లతో సమన్వయం చేసి వేగవంతమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డుల్లోని సమస్యలను పరిష్కరించేందుకు స్పెషల్ డ్రైవ్స్ చేపడుతున్నామని, వృద్ధులందరికీ ఆరోగ్య, జీవన భీమా పథకాలపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు. కొత్తగూడెంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వృద్ధుల కోసం ప్రత్యేక క్యూ లైన్, జిరియాట్రిక్ వార్డ్‌ ఏర్పాటు చేయించి మెరుగైన వైద్య సేవలు అందజేస్తున్నామని తెలిపారు. స్పెషలిస్ట్ డాక్టర్లతో వెల్‌నెస్ సెషన్లు నిర్వహించేలా చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రధానంగా వృద్ధులనే లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న సైబర్, ఆన్‌లైన్ మోసాలు అరికట్టేందుకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్‌కు సంబంధించిన పెండింగ్ సమస్యలు త్వరితగతిన పరిష్కరించేలా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన మాట్లాడుతూ, వృద్ధుల కోసం ప్రభుత్వం అందిస్తున్న 2016 రూపాయల చేయూత పెన్షన్‌ క్రమంగా అందజేస్తున్నామని, కొత్త దరఖాస్తుల కోసం ఆన్‌లైన్ వెబ్సైట్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ప్రచారం చేసి అర్హులందరికీ దరఖాస్తు చేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. 60 ఏళ్లు నిండిన మహిళలు పదిమంది గ్రూపులుగా ఉన్నట్లయితే వారికి బ్యాంకుల ద్వారా రివాల్యూషన్ ఫండ్స్ అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వృద్ధులంతా తప్పనిసరిగా ఆరోగ్య బీమా పొందేలా అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమాల నిర్వాహకులు, వయోవృద్ధుల అసోసియేషన్ సభ్యులు, వృద్ధుల సంక్షేమానికి సేవలందిస్తున్న వ్యక్తులను సన్మానించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు తమ సమస్యలు, అభ్యర్థనలు జిల్లా కలెక్టరుకు వివరించారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు సురేష్, సందీప్, కృష్ణయ్య, శివప్రసాద్, యూసఫ్, శివరామ్, భూషణ్ రావు, వెంకటేశ్వర్లు, సీడీపీఓలు లక్ష్మీప్రసన్న, పద్మశ్రీ, వరప్రసాద్, నరేష్, ప్రవీణ్, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, వయోవృద్ధులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో ‘వెటరన్స్ ర్యాలీ’

Divitimedia

ఉల్వనూరు హెచ్ఎంపై మండిపడిన ఐటీడీఏ పీఓ

Divitimedia

పెళ్లికొడుకైన సినీహీరో విశాల్

Divitimedia

Leave a Comment