Divitimedia
Bhadradri KothagudemBusinessCrime NewsHyderabadLife StyleSpecial ArticlesTelanganaWomen

‘డ్వాక్రా’ మహిళలకు రూ.50లక్షల పైగా ‘టోకరా’…

‘డ్వాక్రా’ మహిళలకు రూ.50లక్షల పైగా ‘టోకరా’…

ఏడాది క్రితం గుర్తించినా ఎవరూ పట్టించుకోలేదెందుకో…?

బూర్గంపాడు ఐకేపీలో వరుసగా బయటపడుతున్న అక్రమాలు

✍️ బూర్గంపాడు – దివిటీ (మే 25)

ఒకటి కాదు, రెండు కాదు.. అక్షరాలా రూ.అర కోటికి పైగానే మహిళల సొమ్ము స్వాహా చేశారు బూర్గంపాడులో ఐకేపీ సిబ్బంది… ఏడాది క్రితమే ఈ అక్రమాలు, అవకతవకలను గుర్తించిన అధికారులు కూడా ఎందుకనో తమకేమీ తెలియనట్లు నటించారు… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ఇందిరాక్రాంతి పథం(ఐకేపీ)లో ఆర్థిక అవకతవకలు, అక్రమాలు వరుసగా బయటపడుతున్న తీరు విస్మయం కలిగిస్తోంది…

మండలంలోని 8 గ్రామ సమాఖ్యల్లో రూ.57 లక్షల వరకు ఓ సీసీ పక్కదారి పట్టించినట్లుగా వెల్లడైంది. ఏడాది క్రితం నుంచి ఆ సీసీ చేసిన అక్రమాల గురించి తెలుసుకున్న ఉన్నతాధికారులు కూడా కనీసచర్యలు తీసుకున్న దాఖలాలే లేకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సీసీ పరిధిలోని 8 గ్రామ సమాఖ్యల్లో శ్రీనిధి రుణాలను రికవరీ చేసే క్రమంలో సీసీ ఆ నిధులను పక్కదారి పట్టించి స్వాహా చేసినట్లుగా చెప్తున్నారు. కాకపోతే ఈ అక్రమంలో అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండలంలో ఒక ప్రాంతాన్ని పర్యవేక్షణ చేస్తున్న సీసీ ఏకంగా రూ.57లక్షల దాకా స్వాహా చేస్తుంటే, ఆ రికవరీల గురించి బాధ్యత కలిగిన ఉన్నతాధికారులకు ఏ సమాచారమూ లేదంటే వమ్మశక్యంగా లేదు. వారి పాత్ర కూడా కచ్చితంగా ఉండవచ్చనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. సీసీ అక్రమాల గురించి ఇటీవలే తెలిసిందంటున్న అధికారులు, మూడురోజుల క్రితం అతనికి ‘షోకాజ్ నోటీస్’ జారీచేసినట్లు సమాచారం. ఆ నోటీసులో గ్రామ సమాఖ్యల వారీగా గుర్తించిన అక్రమాలను ప్రస్తావిస్తూ సీసీ నుంచి వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించిన ఆ సీసీ దాదాపు మూడు నెలల నుంచి విధులకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతుండటం గమనార్హం. మండలం లోని ఒకటి, రెండు కాకుండా ఇన్ని గ్రామ సమాఖ్యల్లో ఆర్థిక అక్రమాలు జరగడం, ఆరంభంలోనే అధికారులు గుర్తించలేక పోవడం ఐకేపీలో పర్యవేక్షణ తీరుకు ఈ వ్యవహారం అద్దంపడుతోంది. ఆ గ్రామ సమాఖ్యల్లో లెక్కలు చూసే బుక్ కీపర్లు (వీఓఏల) పాత్ర కూడా ఈ వ్యవహారంలో ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఒక్కటే కాకుండా మండలంలో ప్రస్తుతం ప్రతిరోజు ఏదో ఒక గ్రూపులో అక్రమాలపై గొడవలు జరుగుతుండటం గమనార్హం. పొదుపు, రుణాలకు సంబంధించి రూ. కోట్లలో లావాదేవీలు జరుగుతున్న ఐకేపీ మహిళా సంఘాల్లో కేవలం ఎనిమిదింట్లో బయటపడిన ఈ భారీ కుంభకోణాన్ని చూస్తుంటే మండల పరిధిలో ఇలాంటివి ఇంకా మరెన్ని బయటపడతాయోననే భయం కలుగుతోంది. పేద, నిరుపేద, మధ్య తరగతి మహిళల ఆర్థిక ఉన్నతి కోసం స్వయం సమృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన డ్వాక్రా సంఘాల వ్యవస్థ గాడి తప్పి ఇంత ఘోరంగా మారుతుంటే మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికారత ఏ విధంగా సాధ్యమవుతుందని సామాజిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ కుంభకోణం గురించి పకడ్బందీ విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవడంతోపాటు మండల పరిధిలోని అన్ని మహిళా సంఘాల్లోని పరిస్థితులను లోతుగా పరిశీలించి, లోపాలు సరిచేసేలా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఇంకుడుగుంత తవ్విన కలెక్టర్

Divitimedia

ఐసీడీఎస్ లో ‘ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్’ దే పైచేయి

Divitimedia

కిన్నెరసాని ప్రాంతం సందర్శించిన కలెక్టర్

Divitimedia

Leave a Comment