లక్షల విలువైన ప్రభుత్వస్థలం స్వాహా
అక్రమార్కులకు అధికారుల సహకారం
సారపాక పంచాయతీలో పట్టింపే లేదేంటి?
✍️ సారపాక – దివిటీ (డిసెంబరు 20)
ఒకటి కాదు రెండు కాదు… ఇరవై, ముప్పై లక్షల రూపాయల విలువ చేసే ప్రభుత్వస్థలం ఆక్రమణకు గురవుతుంటే అంతా తెలిసి కూడా అధికారులు కళ్లు మూసుకున్నారు. ఆక్రమణదారులకు తమ ఆశీస్సులున్నాయనే విధంగా కళ్లు, చెవులు మూసుకున్న అధికారుల వల్ల విలువైన ఆ స్థలం కబ్జాకు గురవుతున్న దుస్థితి… ఇదంతా ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరుగుతున్న తతంగమైతే ఆ విషయం అధికారులకు తెలియదేమో? అనుకోవచ్చు, కానీ ఈ కబ్జా వ్యవహారం అధికారులు నిత్యం సంచరించే జాతీయ రహదారికి ఆనుకునే జరుగుతుండటం గమనార్హం. కొంతకాలంగా జరుగుతున్న ఈ అక్రమం గురించి స్థానికులు పదేపదే సమాచారం అందిస్తున్నప్పటికీ ఎందుకో స్థానిక, మండల అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. సారపాకలోని భద్రాచలం ఆర్చి వద్ద జరుగుతున్న అక్రమమిది… గతంలో సారపాక ఆర్చి సమీపంలో ఓ ప్రభుత్వ యునాని ఆసుపత్రి ఉండేది. వైద్యులు, సిబ్బందితో సహా పనిచేస్తున్న ఆసుపత్రి గురించి ప్రజాప్రతినిధులెవరూ పట్టించుకోకపోవడంతో అధికారులు ఓ సమయంలో గుట్టుచప్పుడు కాకుండా భద్రాచలం తరలించారు. దాదాపు ఏడు, ఎనిమిది సంవత్సరాల నుంచి యునాని ఆసుపత్రి భవనం నిరుపయోగంగా ఉన్న దశలో ఇటీవల జాతీయ రహదారుల విభాగం అధికారులు ఆ భవనంలో కొంత భాగం రహదారి విస్తరణకు అడ్డుగా ఉన్న కారణంగా కూల్చివేశారు. అధికారులు తీసుకున్న స్థలం పోగా మిగిలిపోయిన స్థలం గురించి స్థానిక గ్రామ పంచాయతీ, రెవెన్యూ, వైద్య, ఆరోగ్యశాఖాధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో సందట్లో సడేమియాలా కొందరు ఆక్రమించుకుని అక్రమ నిర్మాణం చేశారు. నాలుగు నెలల క్రితమే ఆ అక్రమ నిర్మాణం గురించి గ్రామ పంచాయతీ ఈఓకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆక్రమణలో కొంతభాగాన్ని మాత్రమే తొలగించి, మరికొంత భాగాన్ని యథాతథంగా ఆక్రమణలోనే ఉంచారు. అసలు ఎవరైనా సొంత స్థలంలో భవన నిర్మాణానికే పంచాయతీ అనుమతి పొందాల్సి ఉండగా, ఆక్రమించుకున్న ఆ ప్రభుత్వ స్థలంలో నిర్మాణానికి కూడా ఏ విధంగా అనుమతులిచ్చారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ వ్యవహారం పరిశీలిస్తే ఆక్రమణదారులపై చర్యలేమీ తీసుకోకుండా అధికారులు లాలూచీపడి ఉండవచ్చని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఇప్పటికైనా కాపాడి, ఏదైనా ప్రజోపయోగం కోసం ఆ స్థలం వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఇప్పటికైనా ఆ స్థలం విషయంలో గ్రామ పంచాయతీ, రెవెన్యూశాఖాధికారులు స్పందిస్తారో? లేదో? చూడాలి మరి…!