Divitimedia
Bhadradri KothagudemCrime NewsLife StyleSpot NewsTechnologyTelangana

భద్రత కరవైన బూర్గంపాడు తహశీల్దారు కార్యాలయం

భద్రత కరవైన బూర్గంపాడు తహశీల్దారు కార్యాలయం

కలకలం రేపిన ‘చోరీకి విఫలయత్నం’ వ్యవహారం

✍️ బూర్గంపాడు – దివిటీ (జూన్ 28)

విలువైన దస్త్రాలు, కంప్యూటర్లు, ఫర్నిచర్, ఇతరత్రా సామగ్రి ఉండే బూర్గంపాడు తహశీల్దారు కార్యాలయం అభద్రతతో కొనసాగుతోంది. మండలానికి గుండెకాయ లాంటి ఈ కార్యాలయంలో అత్యంత విలువైన పత్రాల భద్రత ప్రమాదంలో పడింది. ఈ కార్యాలయంలో వెనుక వైపు నిర్మించిన ఓ అదనపు గదికి తలుపులు, కిటికీలు శిథిలమైపోవడంతో భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. ఈ గదిలో నిల్వ ఉంచిన ఇన్వర్టర్ బ్యాటరీలు, మరికొన్ని పాత కాగితాలను శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు చోరీచేసే ప్రయత్నం చేశారు. అదేసమయంలో స్థానికులు కొందరు రావడంతో దొంగలు ఆ సామగ్రిని వదిలేసి పారిపోయారని చెప్తున్నారు. ఈ వ్యవహారం కాసేపటికి వెలుగుచూడటంతో కలకలం సృష్టించింది. అత్యంత పురాతనమైన నిజాం నవాబుల కాలంనాటి బూర్గంపాడు తహశీల్దారు కార్యాలయం ప్రధానభవనం వెనుక భాగంలో కొన్నేళ్ల కిందట అదనంగా మరో గది నిర్మించారు. ఓ జనరేటర్, తదితర అవసరాల కోసం నిర్మించిన ఆ గదిని సిబ్బంది వినియయోగించారు. ఆ గది శిథిలావస్థకు చేరడంతో సిబ్బంది ఖాళీ చేసి, పాత ఫైళ్లు, పత్రాలు, తదితర సామగ్రి నిల్వ ఉంచారు. పాత కాగితాలు, సామగ్రి కారణంగా ఎలుకలు, కీటకాలతో ఆ గది పూర్తిగా తలుపులు, కిటికీలతో సహా శిథిలావస్థలో ఉంది. ఇక్కడి పరిస్థితులు గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం చోరీకి విఫలయత్నం చేశారు. ఆ గది వెనుక శిథిలమైన తలుపులు తొలగించి లోపలకు ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఆ గదిలోనే ఉన్న పాత బ్యాటరీలను బస్తాలలో వేసుకుని చోరీచేసే యత్నంలో అక్కడే ఉన్న పాతకాగితాలను కూడా వాటిపై వేసుకుని ఎత్తుకుపోయే ప్రయత్నం చేసినట్లు అర్థమవుతోంది. ఆ గదిలో నుంచి కార్యాలయం లోపలకు వచ్చి విలువైన కంప్యూటర్లు, ఇతర సామగ్రి కూడా ఎత్తుకుపోయేలా పరిస్థితులున్నాయి. దీంతో తహశీల్దారు కార్యాలయం భద్రత ప్రమాదంలో పడింది. ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, తాత్కాలికంగానైనా పటిష్టమైన కాపలా ఏర్పాటుచేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ గదుల గోడలు, తలుపులు, కిటికీలకు కూడా మరమ్మత్తులు చేయించి, భద్రత పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది.

ఈ వ్యవహారంపై ఇన్ఛార్జ్ తహశీల్దారు రాంనరేష్ ను ‘దివిటీ మీడియా’ సంప్రదించగా, చోరీకి విఫలయత్నం జరిగిన విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. మరమ్మత్తుల అవసరాన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఆయన వెల్లడించారు.

Related posts

రోటరీక్లబ్ ఆఫ్ రివర్ సైడ్ సేవలు అభినందనీయం.

Divitimedia

నవంబరు 10న ఉమ్మడి జిల్లా పాఠశాలల బాక్సింగ్, సాఫ్ట్ బాల్ ఎంపికలు

Divitimedia

ఆపరేషన్ ముస్కాన్-10 ద్వారా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన

Divitimedia

Leave a Comment