Divitimedia
Bhadradri KothagudemCrime NewsHyderabadLife StyleNational NewsSpecial ArticlesTechnologyTelanganaTravel And Tourism

జిల్లాలో అధ్వానంగా నేషనల్ హైవే నిర్వహణ

జిల్లాలో అధ్వానంగా నేషనల్ హైవే నిర్వహణ

లోపాలతో ప్రమాదకరంగా మారిన పలు ప్రదేశాలు

మరమ్మతులపై అధికారుల అలసత్వమే అసలు సమస్య

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 3)

“జాగ్రత్త బాబూ… హైవే మీద అతి జాగ్రత్తగా ప్రయాణం చెయ్యి… రోడ్డు సరిగా లేదు… ” జాగ్రత్తలు చెప్పాడా తండ్రి… ఇది ఆ ఒక్కరి పరిస్థితే అనుకుంటే పొరపాటే. భద్రాచలం నుంచి కొత్తగూడెం సమీపంలోని రామవరం వరకు నేషనల్ హైవే మీద ప్రయాణిస్తున్న వారందరికీ వారి వారి కుటుంబ సభ్యులు చెప్పే జాగ్రత్త ఇదే మరి…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేషనల్ హైవే నిర్వహణ అధ్వానంగా మారింది. అధికారుల అలసత్వంతో ఈ నేషనల్ హైవే పలుచోట్ల ప్రమాదభరితంగా మారింది. పలుచోట్ల తారు కరిగిపోయి రోడ్డుపై ‘గాడులు’ పడిన పరిస్థితుల్లో ద్విచక్ర వాహనాలు అదుపు తప్పుతున్న దుస్థితి నెలకొంది. బూర్గంపాడు మండల పరిధిలోని మోరంపల్లిబంజర కూడలి ప్రాంతంలోను, పాల్వంచ మండలం జగన్నాథపురం, పెద్దమ్మగుడి, కేశవాపురం, పాల్వంచ బస్టాండ్ ప్రాంతం నుంచి నవభారత్ మధ్య, ఇల్లందు అడ్డరోడ్డు సమీపంలో కూడా తారు కరిగిపోయి గాడులు పడ్డాయి. కొత్తగూడెం పట్టణం దాటింతర్వాత వచ్చే రామవరం సెంటర్లో కూడా రోడ్డుమీద తారు కరిగి పోయి గాడులు పడ్డాయి. వేసవిలో ఎండల తీవ్రత వల్ల భారీ వాహనాల తాకిడి ప్రభావంతో ఏర్పడిన ఈ గాడ్లు ప్రధానంగా ద్విచక్ర వాహనదారులకు ప్రాణాంతకంగా మారాయి. ఆయా ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు రోడ్డు మీద ఏర్పడిన గాడులలో అదుపు తప్పుతున్నాయి. దీనివల్ల ప్రమాదాలు జరిగి, ఇటీవల పలువురు గాయ పడిన సంఘటనలున్నాయి. వీటితోపాటు ఈ నేషనల్ హైవే మీద ఏర్పడిన గోతులను పూడ్చకుండా అలాగే వదిలేస్తున్నారు. ఆ గోతులలో వాహనాలు పడిపోయి అనేకమంది గాయాలపాలవుతున్నారు. గత ఏడాది కూడా ఇలాగే గోతులతో జరిగిన ప్రమాదాల్లో కొందరు మరణించడం, అనేకమంది గాయపడిన సంఘటనలు జరిగాయి. ప్రతిరోజూ వందలాది వాహనాలు తిరిగే ఈ నేషనల్ హైవే నిర్వహణ కనీసం రాష్ట్ర రహదారులను తలపించే స్థాయిలో కూడా ఉండటం లేదని పలువురు ప్రయాణికులు “దివిటీ మీడియా” వద్ద వాపోయారు. ఈ గోతులను ఎప్పటికప్పుడు పూడ్చేలా మరమ్మత్తులు చేయడం లేదనే విమర్శలున్నాయి. ప్రమాదాలు జరిగిన సందర్భంలో కాస్త హడావిడి చేస్తున్న అధికారులు ఆ తర్వాత ఈ విషయమే పట్టించుకున్న పాపాన పోవడం లేదని వాహనదారులు వాపోతున్నారు.
——————-
జిల్లా కేంద్రంలో వంతెనల పరిస్థితులు మరీ దారుణం
——————-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోనూ నేషనల్ హైవే మీద వంతెనల దుస్థితి అధికారుల పని తీరుకు అద్దం పడుతోందనే విమర్శలున్నాయి. ఇక్కడ మొర్రేడువాగుపైనున్న పాత వంతెన గోతులమయంగా ఉంటున్నప్పటికీ నేషనల్ హైవే విభాగం అధికారులకు పట్టడం లేదని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ గోతులు ఎప్పటికప్పుడు పూడ్చకుండానే నిర్లక్ష్యం వహిస్తుండటంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇంక పట్టణం నడిబొడ్డున ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద చిన్నపాటి వర్షం కురిసినా, వరదతో ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇక్కడ అనేక వాహన ప్రమాదాలు జరిగి, ప్రయాణికుల ప్రాణాలు పోయిన సంఘటనలున్నాయి. వీటికితోడు కొత్తగూడెం నుంచి రామవరం వెళ్లే మార్గంలో హైలెవల్ వంతెన పైనుంచి ‘పాదచారుల కోసం’ నిర్మించిన మార్గం చాలాకాలంగా అసంపూర్తిగా వదిలేశారు. దీంతో పాదచారులు కూడా వంతెనపై వాహనాల మార్గంలో రాకపోకలు సాగిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ విధంగా అనేక చోట్ల నేషనల్ హైవే నిర్వహణ పట్ల నెలకొన్న నిర్లక్ష్యం ప్రజలకు ప్రాణాంతకంగా మారుతోంది. ఇప్పటికైనా ఈ జిల్లాలో నేషనల్ హైవే నిర్వహణ పట్ల అధికారులు బాధ్యతగా చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలకు ఏ మాత్రం అవకాశాలు లేకుండా చూడాలని జిల్లాలోని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. ఈ సమస్యల గురించి వివరణ కోరేందుకు “దివిటీ మీడియా” ప్రయత్నం చేసినా, అధికారులు అందుబాటులో లేరు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సుప్రీంకోర్టు ఆదేశాలతో మారుతున్న పరిణామాలు

Divitimedia

కలెక్టర్ కార్యాలయంలో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు

Divitimedia

వాయనాడ్ లో ఏరియల్ సర్వే చేసిన ప్రధాని మోదీ

Divitimedia

Leave a Comment