Divitimedia
Bhadradri KothagudemBusinessHyderabadNational NewsPoliticsTechnologyTelangana

జీఎస్టీ ఎగవేతలపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి

జీఎస్టీ ఎగవేతలపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి

పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

✍️ దివిటీ మీడియా – హైదరాబాదు (మే 16)

రాష్ట్రంలో గతేడాది సమకూరిన ఆదాయం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జీఎస్టీ ఎగవేతలు లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంచనాల మేరకు జీఎస్టీ సాధించడంలో క్షేత్రస్థాయి పరిశీలనలు, ఆడిటింగ్‌ పకడ్బందీగా జరపాలని, జీఎస్టీ ఎగవేతదారులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చి పెట్టే వాణిజ్యపన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు. బడ్జెట్‌లో నిర్ధేశించిన మేరకు రాబడి సాధించేందుకు నెలవారి టార్గెట్స్ ప్రకారం పని చేయాలన్నారు. రాష్ట్ర వార్షికలక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం పెంచడానికి అధికారులు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్లాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయం ఉండాలని, పన్నుల ఎగవేత విషయంలో ఎలాంటి లొసుగులు లేకుండా కఠినచర్యలు చేపట్టాలని హెచ్చరించారు.
అక్రమమద్యం రవాణాను అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వం 2021లో భూముల విలువను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచిందని, ఇప్పటికీ చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు, క్రయవిక్రయ ధరలకు భారీ తేడా ఉందని వ్యాఖ్యానించారు. నిబంధనల ప్రకారం ఏడాదికోసారి భూముల మార్కెట్ విలువ సవరించాల్సి ఉంటుందని, ఆ క్రమంలో ధరల సవరణకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర రాబడి పెంపుతో పాటు స్థిరాస్థి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భూముల మార్కెట్ ధరల సవరణ జరగాలన్నారు.
స్టాంప్‌ డ్యూటీ తగ్గించాలో? పెంచాలో? అనేదానిపై నిర్ణయం తీసుకునేందుకు ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత లేకుండా సర్దుబాటు చేయాలని, అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాల కోసం అధునాతన మోడల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులు నిర్మించాలని సీఎం అభిప్రాయపడ్డారు. సామాన్యులకు ఇసుక కొరత రాకుండా అక్రమ రవాణా, లీకేజీలను అరికట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
హైదరాబాదులో భారీవర్షాలు కురుస్తున్నందున ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంతకుముందు కేరళ రాష్ట్ర పర్యటన ముగించుకుని తిరిగివచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అస్తవ్యస్త పార్కింగ్ అవస్థలకు కాస్త ఊరట

Divitimedia

భూగర్భజలాల పెంపుదలే లక్ష్యంగా జలశక్తి అభియాన్

Divitimedia

సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ విడుదల

Divitimedia

Leave a Comment