ఎన్నికల్లో సహకరించినవారందరికీ ధన్యవాదాలు
ఐటీడీఏ పీఓ, పినపాక ఏఆర్ఓ ప్రతీక్ జైన్
✍️ దివిటీ మీడియా – మణుగూరు (మే 15)
మహబూబాబాద్ (ఎస్టీ) పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, సజావుగా జరగడం పట్ల పినపాక (ఎస్టీ) అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్ హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన మార్చి 16 తర్వాత, నోటిఫికేషన్ విడుదలైన ఏప్రిల్ 18 నుంచి మే 13న పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల నిర్వహణలో నియోజకవర్గం ప్రజల సహకారం, భాగస్వామ్యం మరువలేనిదన్నారు. ఈ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరగడానికి సహకరించిన వివిధ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సమస్యాత్మక ప్రభావిత మండలాలైన గుండాల, కరకగూడెం, ఆళ్లపల్లి మండలాల్లో కూడా ఎలాంటి విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన అధికారులకు, అనధికారులకు పినపాక నియోజకవర్గంలోని మండలాల ప్రజలకు, ముఖ్యంగా పాత్రికేయులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పినపాక నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా జరగడానికి ప్రత్యేక బాధ్యత తీసుకొని విధులు నిర్వహించిన మణుగూరు తహసిల్దార్ రాఘవరెడ్డి, నాయబ్ తహసిల్దార్(ఎలక్షన్) నాగరాజు, రెవెన్యూ సిబ్బందికి, అందరినీ పేరుపేరునా అభినందిస్తున్నామన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

