ప్రమాద బాధితుడికి బ్యాటరీ వీల్ చైర్ అందజేసిన పీఓ




✍️ దివిటీ మీడియా (భద్రాచలం)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బక్కచింతలపాడు గ్రామానికి చెందిన ప్రమాద బాధితుడు మడకం ఇడమయ్య కు ఐటీడీఏ పీఓ బి.రాహుల్, భద్రాచలం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శివ నాయక్ బుధవారం బ్యాటరీతో నడిచే వీల్ ఛైర్ అందజేశారు. ఆరేళ్ల క్రితం రాడ్ బెండింగ్ పనికి వెళ్లిన సందర్భంలో తన చేతిలో ఉన్న ఇనుపరాడ్లు విద్యుత్ తీగ (కరెంట్ వైర్)కు తగిలిన సంఘటనలో ఇడమయ్య తన రెండు చేతులు, రెండు కాళ్లు పూర్తిగా కాలిపోయి వైకల్యం పాలై ఇబ్బందులుపడుతున్నాడు. ఈవిషయం గ్రామానికి చెందిన జూనియర్ లాయర్లు భద్రాచలం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శివనాయక్ దృష్టికి తీసుకు రాగా, ఆయన తన దృష్టికి తెచ్చారని ఈ సందర్భంగా పీఓ వెల్లడించారు. వెంటనే స్పందించి రూ.లక్ష విలువ గల బ్యాటరీ వీల్ చైర్ అందించామన్నారు. విద్యుత్తు షాక్ వల్ల రెండు కాళ్లు, రెండు చేతులు కాలిపోయి వైకల్యం కారణంగా కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నాడనే కారణంతో అదనపు ఆర్థికసాయం కూడా అందించారు. చిరువ్యాపారం పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉపాధి నిమిత్తం మరో రూ.50వేలు వికలాంగుల సంక్షేమశాఖ ద్వారా ఇప్పిస్తామని పీఓ ఈ సందర్భంగా వెల్లడించారు. వీల్ చైర్ మంచిగా ఉపయోగించుకుని, కుటుంబ పోషణకందించే రూ.50వేలతో ఏదైనా చిరువ్యాపారం చేసుకుని జీవనోపాధి కల్పించుకోవాలని ఇడమయ్యకు పీఓ సూచించారు. బుధవారం ఐటీడీఏ పీఓ చాంబర్లో జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజి స్ట్రేట్ శివనాయక్, లాయర్లు, గ్రామస్తుల సమక్షంలో ఇడమయ్యకు వీల్ చైర్ అంద జేసే కార్యక్రమానికి ముందు ఐటీడీఏ పీఓ రాహుల్, మేజిస్ట్రేట్ శివనాయక్ పరస్పరం అభినందించుకున్నారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ శివనాయక్ పీఓ కు మొక్కను అందించి శుభాకాంక్షలు తెలియజేయగా, ఐటీడీఏపీఓ మెజిస్ట్రేట్ శివనాయక్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి స్వర్ణలతలెనినా, ఐటీడీఏ పరిపాలన అధికారి సున్నం రాంబాబు, సీనియర్ న్యాయవాదులు ఆలూరు సత్యనారాయణ, అంబేద్కర్, పామరాజు తిరుమలరావు, సాధనపల్లి సతీష్, దాట్ల సంధ్య, బి.శారద, గాయత్రి, వర్ధన్, మల్లేష్, బండరమేష్, తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

