తాలిపేరు ప్రాజెక్టును సందర్శించిన జిల్లా కలెక్టర్




ఏకలవ్య మోడల్ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
✍️ దివిటీ మీడియా (భద్రాచలం)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లోని తాలిపేరు ప్రాజెక్టును బుధవారం సందర్శించిన జిల్లాకలెక్టర్ అంకిత్, చర్ల ఏకలవ్య మోడల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. తాలిపేరు ప్రాజెక్టులోని ప్రస్తుత నీటిమట్టం, నీటి ప్రవాహం, నీటి విడుదల, ప్రాజెక్టు నిర్వహణ, సిబ్బంది తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 74మీటర్లు కాగా ప్రస్తుతం 73.80మీటర్ల మేర నీరుందని, ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ఛత్తీస్ గఢ్ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహం, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తక్కువగా ఉందన్నారు. నీటిప్రవాహం పెరుగుతూ, తగ్గుతూ కొనసాగుతోందని, బుధవారం ఉన్న దాదాపు 2,200క్యూసెక్స్ ఇన్‌ఫ్లో, రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా 200 క్యూసెక్స్, కుడికాలువ ద్వారా 30 క్యూసెక్స్ నీటిని విడుదల చేస్తున్నామన్నారు. తాలిపేరు ప్రాజెక్టు నుంచి దాదాపు 24 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నట్లు వివరించారు. ప్రాజెక్టులో పనిచేస్తున్న సిబ్బంది, నిర్వహణకు సంబంధించిన వివరాలు కలెక్టర్ తెలుసుకున్నారు. ఆ ప్రాజెక్టు కంట్రోల్ రూమ్, డ్యామ్ పరిసర ప్రాంతాలు, భద్రత, నిర్వహణసంబంధిత అంశాలను పరిశీలించారు.
చర్లలోని ఏకలవ్య మోడల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లాకలెక్టర్, బోధన, వసతులు, భోజన, వైద్యసేవలు, పరిశుభ్రత, తదితర అంశాలు స్వయంగా పరిశీలించారు. కలెక్టర్ తరగతి గదులు సందర్శించి, విద్యార్థులకు బోధిస్తున్న విధానాన్ని పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతం తెలుసుకున్న అనంతరం విద్యార్థులను ప్రశ్నలడిగి అవగాహన, అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యార్థుల నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాలు పరిశీలించి, విద్యార్థులతోనే చదివించి సామర్థ్యం అంచనా వేశారు. పాఠశాలలో విద్యార్థులకెదురవుతున్న సమస్యలు, వసతులలో ఇబ్బందులపై ఆరాతీశారు.
వంటగదిలో పరిశుభ్రత, వంట విధానం, ఉపయోగిస్తున్న కూరగాయలు, ఇతర పదార్థాల నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారో లేదోనని తెలుసుకున్నారు. భోజనం నాణ్యత, రుచి, పరిమాణం, తదితర విషయాలపై విద్యార్థులను అడిగారు. విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆ పాఠశాల ఆవరణలోని హెల్త్ సెంటర్ పరిశీలించి అందుబాటులో ఉన్న మందులు, విద్యార్థులకందిస్తున్న వైద్యసేవలు, చేస్తున్న ఆరోగ్యపరీక్షలతో పాటు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన వివరాలను ఏఎన్‌ఎంను అడిగి తెలుసుకున్నారు. హాజరు రిజిస్టర్ తో పాటు పాఠశాలలో నిర్వహిస్తున్న రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. కలెక్టర్ పర్యటనలో ఇరిగేషన్, మండల అధికారులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

