రైతుసంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం…
మెగా రైతుమేళా ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
‘రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద రైతు ఆశీర్వాదసభకు చింతకాని వేదిక’
”9రోజుల్లో రూ.9వేల కోట్ల రైతుభరోసా అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ’
‘తక్కువనీటితో అధికాదాయం వచ్చే పంటలపై రైతులు దృష్టిపెట్టాలి‘
✍️ దివిటీ మీడియా – ఖమ్మం ప్రతినిధి
రైతుసంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం జగన్నాధపురంలో గురువారం నిర్వహించిన ‘మెగా రైతు మేళా’ ప్రారంభించిన సందర్భంగా భట్టి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ దివాకర.టిఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల అవసరాలు, వ్యవసాయ రంగ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకశ్రద్ధతో పనిచేస్తోందన్నారు. విత్తనం వేసినప్పటి నుంచి పంట కొనుగోలువరకు ప్రతిదశలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటోందని, రైతులకెలాంటి ఇబ్బందులు కలుగకుండా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామన్నారు. రైతు సంక్షేమంపై ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని, తమ ప్రభుత్వం మాటల వరకే పరిమితం కాకుండా చేతల్లో చేసి చూపించే ప్రభుత్వమన్నారు. దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, కడెం వంటి సాగునీటి ప్రాజెక్టులు నేటికీ రైతులకు నీరందిస్తున్నాయన్న భట్టి, గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం కుంగి పోవడం ఆ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ప్రతి కుటుంబానికి వ్యవసాయంతో అనుబంధం ఉందని, అందుకే ఇక్కడ రైతు ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కేవలం 9 రోజుల్లో రూ.9వేల కోట్ల రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమచేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. అనేక సమస్యలున్నప్పటికీ ధాన్యం, మొక్క జొన్న తదితర పంటలను మద్దతుధరకు కొనుగోలు చేశామని భట్టి తెలిపారు. వ్యవసాయ ఆధునికీకరణ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు ప్రతి జిల్లాలో ఆయిల్‌పామ్ సాగును విస్తరిస్తున్నామని తెలిపారు. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రత్యామ్నాయ పంటలపై శాస్త్రవేత్తలతో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జులై 10న జరిగే రైతు ఆశీర్వాదసభకు సీఎం సహా తెలంగాణ మంత్రివర్గం మొత్తం హాజరవుతోందన్నారు. ప్రస్తుతం రైతులకు అందుతున్న ప్రతి నీటి చుక్క కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారానే వస్తోందని తెలిపారు. రైతులను మాయమాటలతో మోసం చేసే పార్టీలకు ప్రజలు అవకాశం ఇవ్వబోరని అన్నారు. రైతు సంక్షేమానికి పునాదులు వేసిన ప్రభుత్వాలను రైతులే కాపాడుకుంటారని, ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న అబద్ధాలను ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. చింతకాని మండలంలో మూడు లక్షల మంది రైతులతో భారీ రైతు ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యవసాయరంగంలో వస్తున్న ఆధునిక మార్పులు రైతులకందించాలనే లక్ష్యంతో స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. రైతుల అభివృద్ధికి శాస్త్రవేత్తలు చెప్పే అంశాలు రైతులు శ్రద్ధగా విని గ్రామాలకు తీసుకెళ్లాలని కోరారు. ఆధునిక సాగు పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలని కోరారు. వ్యవసాయంతో పాటు ఫిషరీస్, హార్టికల్చర్ తదితర అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ సీఎం తెలిపారు.







వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, జూన్ 30న నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభ వర్షాల కారణంగా జూలై 10వ తేదీకి వాయిదా పడిందన్నారు. తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద రైతుసభ చింతకాని మండలంలో నిర్వహిస్తున్నామన్నారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో కురవడంలేదని, ఈ ఏడాది సాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ఎలా వ్యవసాయం చేయాలనే అంశాలపై వ్యవసాయశాఖ శాస్త్రీయ సూచనలు అందిస్తోందన్నారు.
వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వైరా ప్రాజెక్టుకు గోదావరి జలాలు అందించాలని చేసిన విజ్ఞప్తికి డిప్యూటీ సీఎం భట్టి సానుకూలంగా స్పందించారని తెలిపారు. సీతారామ ఎత్తిపోతలపథకం వినియోగించుకుని రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా గోదావరి నీరు వైరాప్రాజెక్టుకు తరలిస్తున్నందున, వర్షాలతో సంబంధం లేకుండా దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరందుతుందని చెప్పారు. తక్కువ కాలంలో, తక్కువ నీటితో పండే పంటలను రైతులు సాగు చేయాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు చేయలేదని, రైతులు నష్టపోకుండా ఉండేందుకు డిప్యూటీ సీఎం రూ.5 వేల కోట్లు కేటాయించి మద్దతుధరకు మొక్కజొన్న కొనుగోలు చేశారని తెలిపారు. జొన్న, సోయా వంటి పంటలు కూడా మద్దతు ధరకు కొనుగోలు చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని తుమ్మల తెలిపారు. మొక్కజొన్న విక్రయించిన రైతుల ఖాతాల్లో మద్దతు ధర చెల్లింపులు రేపటిలోగా జమ చేస్తామని స్పష్టం చేశారు. జూలై 10న జరిగే రైతు ఆశీర్వాద సభ చారిత్రక ఘట్టమని, రైతులకు అవసరమైన ప్రతి సహాయం రాష్ట్రప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే రైతు ఆశీర్వాద సభకు లక్షలాది మంది రైతులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమాలు, పోరాటాలు, వ్యవసాయ రంగంలో ఖమ్మం జిల్లాకు ఘన చరిత్ర ఉందని, జిల్లాలో అత్యధికంగా ఆయిల్‌పామ్ సాగు జరుగుతోందన్నారు. సంప్రదాయపంటలేకాక ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని, అధికాదాయం వచ్చే పంటలను సాగు చేయాలని సూచించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల ద్వారా వచ్చే వేతనం కంటే ఆయిల్‌పామ్ సాగుతో అధిక ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రకృతి సహకరించక పోయినా రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రైతులకు అవసరమైన యూరియాను కేంద్రప్రభుత్వంతో చర్చించి సమకూరుస్తున్నామని, యూరియా యాప్ ద్వారా అవసరమైన మేరకే కొనుగోలు చేయాలని సూచించారు. యూరియా యాప్ వల్ల దుర్వినియోగానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. రైతులకు వాతావరణ పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం కూడా అందిస్తున్నామని, మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి విత్తనాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రపంచంలో ఉన్న అత్యాధునిక వ్యవసాయ సాంకేతికతను రైతులకందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మెగా రైతు మేళా, రైతు ఆశీర్వాద సభ నిర్వహణకు అద్భుతమైన ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం, అధికారులు, సిబ్బందిని మంత్రి అభినందించారు.
వ్యవసాయశాఖ రాష్ట్ర డైరెక్టర్ గోపి మాట్లాడుతూ, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రైతులకు వివరించేందుకు ఈ మెగా రైతుమేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆదర్శరైతులు అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు ఇతర రైతులకు పరిచయం చేయడం కూడా కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. పంట మార్పిడి విధానం అమలు చేయడం, ఎరువుల వినియోగం తగ్గించడం, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ, మెగా రైతుమేళా కోసం మొత్తం 150 స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ శాఖతో పాటు హార్టికల్చర్, ఫిషరీస్, పశుసంవర్ధక శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మెగా రైతు మేళాకు 5వేల మంది రైతులు వస్తారని అంచనా వేయగా, దాదాపు 11 వేల మంది రైతులు హాజరయ్యారని తెలిపారు. వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ, ఈ నెల 10న సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాకు విచ్చేయనున్నారని, ‘రైతు ఆశీర్వాదం’ పేరుతో నిర్వహిస్తున్న బహిరంగసభకు రైతులు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, హస్త కళల అభివృద్ధి సంస్ధ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

