ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రత

1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు
భద్రతా విధులపై దిశానిర్దేశం చేసిన పోలీస్ కమిషనర్
✍️ దివిటీ మీడియా – ఖమ్మం ప్రతినిధి
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా, చింతకాని మండలం, జగన్నాధపురంలో శుక్రవారం ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాదసభకు వస్తున్న నేపథ్యంలో ఆ పర్యటన బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందితో గురువారం సమావేశమైన పోలీస్ కమిషనర్ సునీల్ దత్ భద్రతా ఏర్పాట్లు, విధుల నిర్వహణ, సమన్వయంపై సమగ్ర దిశానిర్దేశం చేశారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులకు, సిబ్బందికి సభా వేదిక వద్ద ప్రత్యేక బ్రీఫింగ్ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ మాట్లాడారు. సభా ప్రాంగణం మొదలు, హెలిప్యాడ్, వాహన పార్కింగ్ ప్రాంతాలతోపాటు ఇతర కీలక ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పోలీస్ అధికారులతో సమీక్షించారు. సీఎం పర్యటన భద్రతా ఏర్పాట్ల కోసం దాదాపు 1500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్త్ విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరూ కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సీపీ సూచించారు. భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని, విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా విధులు నిర్వర్తించాలని సీపీ సూచించారు. పోలీసు అధికారులకు విధి నిర్వహణలో పాటించాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలతో మర్యాదపూర్వక వ్యవహారం, వీఐపీ భద్రత, తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీలు సారంగపాణి, తిరుపతిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

