రేషన్ డీలర్ నుంచి లంచం తీసుకుంటూ…
ఏసీబీకి పట్టుబడిన డీటీ, మరో ఇద్దరు
✍️ దివిటీ – ఇల్లందు, (నవంబరు 17)
రేషన్ దుకాణంలో గుర్తించిన అవకతవకలను ఆసరా చేసుకున్న డీటీ (డెప్యూటీ తహసీల్దారు), వాటిపై రిపోర్ట్ పంపి సదరు రేషన్ డీలర్ మీద చర్యలు తీసుకోకుండా ఉండేందుకు లంచం తీసుకుంటున్న ఘటన సోమవారం వెలుగు చూసింది. ఈ మేరకు ఇల్లందు మండలంలో ఓ రేషన్ డీలర్ వద్ద నుంచి రూ.30,000 లంచం తీసుకుంటూ డెప్యూటీ తహసీల్దారు మహమ్మద్ యాకూబ్ పాషా సోమవారం ఏసీబీకి పట్టుబడ్డారు. పని వేళల్లో ఆ దుకాణం మూసివేయడంతో పాటుగా, ఉండాల్సిన దానికంటే రేషన్ తక్కువ స్టాక్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గుర్తించిన ఈ అవకతవకలపై ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపించకుండా ఉండేందుకు ఆ డీలర్ నుంచి డీటీ యాకూబ్ పాషా, జీసీసీ టెక్నికల్ అసిస్టెంట్(ఇపాస్) విజయ్ కుమార్ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. ఈ కేసులో బాధిత రేషన్ డీలర్ ఫిర్యాదు మేరకు వారు ఇల్లందు మండల రేషన్ దుకాణ డీలర్ల అధ్యక్షుడు పోతు శబరీష్ ద్వారా రూ.30వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ, ఏ ప్రభుత్వ సేవకుడైనా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేసి సంబంధిత సమాచారం అందించాలని కోరారు. దీనితోపాటు వాట్సాప్ నెంబర్ : 9440446106, ఫేస్ బుక్ అకౌంట్ Telangana ACB, ఎక్స్ అకౌంట్ @TelanganaACB, వెబ్ సైట్ ‘acb.telangana.gov.in‘ ల ద్వారా కూడా సంప్రదించవచ్చునని తెలిపారు.
“ఫిర్యాదుధారులు / బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పేర్కొన్నారు.

