Divitimedia
Bhadradri KothagudemBusinessCrime NewsHyderabadLife StyleSpecial ArticlesTelanganaWomen

వరుసగా బయటపడుతున్న ఐకేపీ అక్రమాలు…

వరుసగా బయటపడుతున్న ఐకేపీ అక్రమాలు…

బూర్గంపాడు ఐకేపీలో అసలేం జరుగుతోంది…?

ఉన్నతాధికారుల పాత్రపైనా అనుమానాలు

✍️ దివిటీ మీడియా – సెప్టెంబరు 23

(Please don’t copy this article. Help good Journalism)

‘కంచే చేను మేసిన’ చందంగా డ్వాక్రా మహిళలకు దిశానిర్దేశం చేయాల్సిన సిబ్బందే ఆ మహిళల సొమ్ము ‘స్వాహా’ చేస్తున్న ఉదంతాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. కిందిస్థాయిలో సిబ్బంది ఏకంగా రూ.లక్షల్లో మింగేస్తుంటే ఏమీ తెలుసుకోకుండా, తెలిసినప్పటికీ ఏమీ పట్టించుకోకుండా మొద్దు నిద్ర పోతున్న అధికారులు డ్వాక్రా మహిళలను నిండా ముంచుతున్నారు. మహిళల కష్టార్జితం రూ.లక్షలకు లక్షలు దోచుకునేవారికి ఈ అధికారులు తమవంతు సహకరిస్తున్న తీరు విస్మయం కలిగిస్తోంది.

బూర్గంపాడు మండలంలో ఐకేపీ నిధుల స్వాహా వ్యవహారాలు వరుసగా బయట పడుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యవహారాలలో ఉన్నతాధికారులకు కూడా భాగస్వామ్యమేమైనా ఉందేమో? అనే స్థాయిలో పరిస్థితులున్నాయి. ఈ మండలంలో 60గ్రామసమాఖ్యల్లో 1257 మహిళా సంఘాలుండగా 12,132మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఇంత పెద్దసంఖ్యలో మహిళలు సంఘాలుగా పొదుపులు, రుణాలు, చెల్లింపుల వంటి ఆర్థిక లావాదేవీలు రూ.కోట్లలో చేస్తున్న పరిస్థితి. మహిళల ఆర్థిక స్వావలంబన సాధన కోసం పనిచేస్తున్న ఈ వ్యవస్థలో క్షేత్రస్థాయిలో మార్గదర్శనం చేయాల్సిన ‘వీఓఏల’లో అక్రమాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. మండలంలో రాంబాబు అనే సీసీ మహిళాసంఘాలకు సంబంధించిన రుణాల రికవరీ సొమ్ము దాదాపు రూ.57లక్షలు స్వాహా చేసినట్లు కొన్నిరోజుల క్రితం బయటపడింది. జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆనాటి స్వాహా వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపినప్పటికీ ఏం చర్యలు తీసుకున్నారనేది నేటికీ ప్రశ్నార్ధకంగానే ఉంది. ఆ ఉదంతంపై విచారణ జరిపిన సందర్భంగా బూర్గంపాడు మండలంలో అన్ని డ్వాక్రా సంఘాల ఆర్థికలావాదేవీల మీద ‘ఆడిట్’ చేయించారు. ఆ ఆడిట్లో ఎక్కడా అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకున్నట్లు గుర్తించకపోగా, సారపాక గ్రామంలో తాజాగా వసంత అనే వీఓఏ, తన పరిధిలో గ్రామసమాఖ్యలో ఏకంగా రూ.5.60లక్షలు స్వాహా చేసిన విషయం వెలుగులోకొచ్చింది. ఓ పెద్ద కుంభకోణం బయటపడిన తర్వాత నిర్వహించిన ఆ ఆడిట్లో కనీసం రూ.5.60లక్షల స్వాహా వ్యవహారం ఆనవాళ్లు కూడా గుర్తించలేక పోయారంటే, ఆడిట్ ఎలా జరిగిందనేది తేలికగానే అర్థం చేసుకోవచ్చు. ఓ సీసీ పాల్పడిన అక్రమాలపై విచారణ ఇంకా పూర్తికాకముందే, మరో వీఓఏ చేసిన రూ.5.60లక్షల స్వాహా బయటపడటం విశేషం. తాజా ఉదంతంతో మండలం పరిధిలోని 1257 డ్వాక్రా సంఘాలలో మరెన్ని అవకతవకలు, అక్రమాలు దాగి ఉన్నాయోనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మహిళలు కష్టపడి కూడబెట్టుకుంటున్న పైసా పైసా కలిపి చేస్తున్న పొదుపు, తీసుకున్న రుణాలపై తిరిగి చెల్లిస్తున్న డబ్బులకే భద్రత లేని పరిస్థితుల్లో డ్వాక్రా సంఘాల ‘మనుగడే’ ప్రశ్నార్ధకమైపోతోంది. మహిళలందరినీ (కోటి మందిని) కోటేశ్వరులను చేయడం తమ లక్ష్యంగా ప్రకటించిన ప్రభుత్వం, ఈ మండలంలో చోటుచేసుకున్న అక్రమ వ్యవహారాలపై సమగ్రంగా ఉన్నతస్థాయి విచారణ జరిపించి, బాధ్యులైన ఐకేపీ సిబ్బందిపై కఠినచర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు.
########
మండలంలో బయటపడిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఐకేపీ ఏపీఎం హేమంతిని ‘దివిటీ మీడియా’కు తెలిపారు.

Related posts

జిల్లాలో ఇసుక అక్రమరవాణా పూర్తిగా అరికట్టాలి

Divitimedia

అంతరపంటల సాగుతో ఆర్థికాభివృద్ధి

Divitimedia

‘ఐసీడీఎస్’లో అధికారుల వసూళ్లపై ఆర్జేడీ విచారణ

Divitimedia

Leave a Comment